నెల్లూరు: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రిమాండ్ ఖైదీ మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం...నెల్లూరులోని కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన నిమ్మల విఘ్నేశ్వర్(25) దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. అతనిపై కోవూరు, సంగం, బుచ్చిరెడ్డిపాలెంలో దొంగతనం కేసులున్నాయి. ఈ క్రమంలో 2015 జనవరి 9న కోవూరు కోర్టు దొంగతనం కేసులో అతనికి రిమాండ్ విధించింది. అప్పటి నుంచి విఘ్నేశ్వర్ నెల్లూరు జైలులో రిమాండ్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఈనెల 11న విఘ్నేశ్వర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. శ్వాస ఆడక ఇబ్బంది పడసాగాడు. దీంతో అతనిని పరీక్షించిన జైలు వైద్యులు చికిత్సనిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు మెరుగైన వైద్యంకోసం అతన్ని తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ గురువారం రాత్రి విఘ్నేశ్వర్ మృతిచెందాడు. రిమాండ్‌ఖైదీ మృతిపై జైలు అధికారులు బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు శుక్రవారం తిరుపతికి బయలుదేరి వెళ్లారు.
నెల్లూరు జైలు రిమాండ్ ఖైదీ మృతి
Published Fri, Mar 13 2015 9:59 PM | Last Updated on Sat, Oct 20 2018 6:07 PM
Advertisement
Advertisement