విజయనగరం(ఎస్. కోట): హాల్ టికెట్ ఇవ్వలేదని కలత చెందిన విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలం వల్లాలపుడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వేపాడ మండలం వల్లాలపుడి గ్రామానికి చెందిన బైల ధనలక్ష్మి(17) వేపాడ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ రోజు ద్వితీయ సంవత్సరం పరీక్ష జరగనుండగా తన హాల్ టికెట్ ఇవ్వాలని కళాశాల సిబ్బందిని కోరింది. దానికి వారు నిరాకరించడంతో మనస్థాపానికి చెందిన ధనలక్ష్మి ఆత్మహత్య యత్నం చేసింది. పరిక్ష రాయడానికి అవసరమైన హాజరు లేకపోవడంతోనే హాల్ టికెట్ ఇవ్వడాన్ని నిరాకరించామని కళాశాల సిబ్బంది అంటున్నారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.