తీరనున్న ఆధార్ కష్టాలు
Published Fri, Dec 27 2013 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఆధార్ ఎన్‌రోల్ మెంట్ నంబర్ల కోసం నిరీక్షిస్తున్న జిల్లా ప్రజల కష్టాలు తీరనున్నాయి. జనవరి 1నుంచి 140 ఆధార్ నమోదు కేంద్రాలు జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ప్రతి విషయానికీ వజ్రాయుధంలా మారిన ఆధార్ నంబర్ కోసం ప్రధానంగా ఉద్యోగుల కుటుంబాలు విశాఖ వరకూ పరుగులు పెడుతున్నారు. తక్షణమే ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ప్రారంభించి కనీసం ఎన్‌రోల్ మెంట్ నం బర్లు అయినా జారీ చేయాలన్న విజ్ఞప్తులు అధికమయ్యాయి. దీంతో స్పందించిన యంత్రాంగం ఆధార్ కేంద్రాల కోసం ప్రభుత్వానికి నివేదించారు. ఎట్టకేలకు జిల్లాలో ఆధార్ కేం ద్రాలు ప్రారంభించడానికి రెండు ఏజెన్సీలకు అనుమతులు మంజూరయ్యాయి. దీంతో ఆ ఏజెన్సీలకు చెందిన ప్రతినిధు ల బృందం గురువారం కలెక్టరేట్‌కు వచ్చారు. ప్రస్తుతం కలెక్టర్ కాంతిలాల్ దండే సెలవులో ఉండడంతో ఈ నెల 31న రావాలని అధికారులు వారికి సూచించారు.
జనవరి1 నుంచి కేంద్రాల ప్రారంభానికి
సన్నాహాలు..
జిల్లాలో ఆధార్ కేంద్రాల ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. యూనియన్‌బ్యాంకు ఆధ్వర్యంలో రెండు ఏజెన్సీలు, దేనా బ్యాంకు ఆధ్వర్యంలో ఒక ఏజెన్సీ ఆధార్ నమోదు కేంద్రాలను ప్రారంభించనున్నాయి. యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఫినో సంస్థ 40 కేంద్రాలు,స్మార్ట్‌చిప్ లిమిటెడ్ 50, దేనా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్లూమ్స్‌సొల్యూషన్స్ 50 కేంద్రాలు జిల్లాలో ప్రారంభించనున్నాయి. మొత్తం మీద ఈ కేంద్రాలు ప్రారంభమైతే జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరనున్నాయి.
Advertisement
Advertisement