చిన్న రాష్ట్రాలకే ‘ఆప్’ ఓటు
ఆప్ నేత ప్రశాంత్ భూషణ్
తెలంగాణకు న్యాయం
జరగనందునే ఈ పరిస్థితి
లోక్‌సత్తా విలీనంపై చర్చలు కొనసాగుతున్నాయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలమేనని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సంకేతమిచ్చింది. అధికార వికేంద్రీకరణను విశ్వసించే తమ పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ఆప్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఏళ్లతరబడి పాలించిన నాయకుల వల్ల తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదని, ప్రస్తుత పరిస్థితికి అదే కారణమని ఆరోపించారు. విభజనతోనే తెలంగాణ సమస్యలు పరిష్కారం కావని, గ్రామస్థాయి నుంచి అధికార వికేంద్రీకరణ జరగాలని అన్నారు. ఎన్నికలకు ముందే పొత్తులకు తాము విముఖమని పేర్కొన్నారు. ఆప్‌లో లోక్‌సత్తా పార్టీ విలీనానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, ఇప్పుడే దీనిపై మాట్లాడ్డం తొందరపాటవుతుందన్నారు. ‘జాతీయ రాజకీయాల్లోకి ఆప్’ అంశంపై శనివారమిక్కడి ఏవీ కాలేజీలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తర్వాత మీడియాతోనూ మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
విభజనను పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోణంలోనే చూస్తున్నాయే తప్ప ప్రజల కోణంలో కాదు. ఏపీలోని అన్ని ప్రాంతాల హక్కుల కోసం మేం పోరాడతాం. ఏపీలో మా పార్టీలో లక్ష మంది చేరారు. రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి కమిటీ ఏర్పాటుకు కసరత్తు సాగుతోంది. రెండు ప్రాంతాల్లోనూ పోటీ చేస్తాం.
దేశంలో అవినీతే ప్రధాన సమస్య. కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలూ బడా పారిశ్రామికవేత్తలకు, కార్పోరేట్ సంస్థకు కొమ్ము కాస్తున్నాయి. ప్రజాధనాన్ని రిలయన్స్ లాంటి సంస్థల జేబులు నింపేలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ రాజకీయాల్లో అవినీతి, ఆశ్రీతపక్షపాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్టులు పొత్తూరి వెంకటేశ్వరరావు, టంకశాల అశోక్, ఆప్ రాష్ట్ర నేతలు రామకృష్ణరాజు, ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డి, నటులు శివాజీ తదితరులు సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రామకృష్ణరాజు అధ్యక్షతన స్నేహలత, విజయ్‌ప్రకాశ్, ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డి, ఉమాశంకర్, వినోద్‌కుమార్, ఎంజే థామస్, ఆర్షద్‌లతో ఆప్ రాష్ట్ర సమన్వయ కమిటీని ప్రకటించారు. ప్రశాంత్ భూషణ్ హైదరాబాద్ నాగార్జునా హిల్స్‌లో ఆప్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు.
సమావేశం రసాభాస
‘జాతీయ రాజకీయాల్లోకి ఆప్’ అంశం పై హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఆప్ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ప్రశాంత్ భూషణ్ చెప్పడంతో తెలంగాణ ప్రాంత ప్రతినిధులు ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. దీని పై సీమాంధ్ర ప్రతినిధులు అభ్యంత రం వ్యక్తం చేశారు. ‘మా ప్రాంతంలో ఆప్‌లో 20 వేల మందిని చేర్పించాం. పార్టీ తెలంగాణకు అనుకూలమంటే ప్రజల్లోకి ఎలా వెళ్లగ లం?’ అని నిలదీశారు. దీంతో ఉద్రితక్త తలెత్తింది. ఇరు ప్రాంతాల ప్రతినిధులు తోపులాటకు దిగారు. పార్టీ నేతలు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత బీజేవైఎం నేతలు అక్కడికొచ్చి.. కాశ్మీర్‌పై రిఫరెండమ్ నిర్వాహించాలన్న ప్రశాంత్ భూషణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేశారు.
ఆప్‌లో విలీనంపై చర్చలు జరపడం లేదు: లోక్‌సత్తా
ఆప్‌లో తమ పార్టీ విలీనానికి సంబంధించి ఎలాంటి చర్చలూ జరగడం లేదని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఏపీలో లోక్‌సత్తా పార్టీ సారథ్యంలో రెండు పార్టీలూ పనిచేయాలన్న దానిపైనే యోచిస్తున్నామని ‘సాక్షి’తో అన్నారు.