బాలుడిని తల్లికి అందజేస్తున్న తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్
ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఏడాదిన్నర బాబును కిడ్నాపర్ అపహరించింది మొదలు నిద్రాహారాలు మానేసిన ఆ దంపతులు మంగళవారం కొండంత సంబర పడ్డారు. బిడ్డ ఒడిచేరగానే తల్లి కంట ఆనందభాష్పాలు కట్టలు తెంచుకున్నాయి. తిరుమలలో వీరేష్ కిడ్నాపు ఫలితంగా ఏర్పడిన నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది. పోలీసులతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కిడ్నాప్ కేసును ఛేదించిన విధానాన్ని అర్బన్ జిల్లా ఎస్పీ కెకెఎన్ అన్బురాజన్ మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియాకు వివరించారు.
తిరుపతి క్రైం : గత నెల27వ తేదీ రాత్రి మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన ప్రశాంత్ యాదవ్, అతని భార్య స్నేహలు తమ బిడ్డ వీరేష్ (18 నెలలు)తో తిరుమలకు వచ్చారు. మర్నాడు ఉదయం చూసేసరికి వీరేష్ కనపడలేదన్నారు. కాసేపు వెతికాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబు వివరాలు తెలియజేశారు. వారిచ్చిన వివరాల ఆధారంగా వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. తిరుమల, తిరుపతిలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అనుమానిత వ్యక్తి బాలుడిని తీసుకెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలతో ప్రత్యేక బృందాలను కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి నగరాలలో ముమ్మర తనిఖీలు చేశారు. ఈలోగా నిందితుడి ఊహా చిత్రాలను, కిడ్నాప్ వివరాలను పత్రికలలోను, సామాజిక మాధ్యమం ద్వారా ముమ్మర ప్రచారం చేశారు. దీనివల్ల దేశమంతా ఈ ఘటన పాకింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మహూర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రేణుకాదేవి ఆలయం వద్ద బాలుడితో కిడ్నాపర్ తిరుగుతున్న వైనాన్ని ఓ వ్యక్తి గమనించాడు. అప్పటికే ఈ కిడ్నాప్ సమాచారాన్ని మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశాడు.
వెంటనే పోలీసులు చేరుకుని కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి సురక్షితంగా బాలుడ్ని కాపాడారు. మహారాష్ట్ర పోలీసుల సమాచారంతో తిరుమల ఏఎస్పీ కేఎస్.మహేశ్వర్‌రాజు, సీఐ రామకృష్ణ అక్కడకు వెళ్లారు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని, బాబును వెంట బెట్టుకుని తిరుపతికి వచ్చారు. కిడ్నాపర్ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఐ.విశ్వంబర్(43)గా గుర్తించారు. ఇతను తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అవివాహితుడు. రెండుమూడు నెలలకొకసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవారు. అదేమాదిరిగా ఇటీవల తిరుమలకు వచ్చి వీరేష్‌ను కిడ్నాప్ చేశాడు. తనకు ఎవరూ లేకపోవడంతో వృద్ధాప్యంలో తోడుగా ఉంటాడనే బాలుడిని కిడ్నాప్ చేసినట్లు విశ్వంబర్ చెబుతున్నాడు. మరే ఉద్దేశం లేదని పోలీసులకు విచారణలో తెలిపాడు. పూర్తిస్థాయిలో విచారించి నిజానిజాలను తేలుస్తామని అర్బన్ ఎస్పీ చెప్పారు. తిరుమలకు వచ్చే యాత్రికులు కూడా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. పిల్లలు కన్పించకపోతే మరి ఆలస్యం చేయకుండా అతివేగంగా పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు. అలా చేస్తే సకాలంలో నిందితులను అదుపులోకి తీసుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివరామరెడ్డి, క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, డీఎస్పీ రవిమనోహరాచారీ, ఎస్సీ,ఎస్టీ సెల్ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment