
ఏసీబీ డీజీగా ఏకే ఖాన్; ఆర్టీసీకి పూర్ణచంద్రరావు
ఇన్నాళ్లూ ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలను నడిపించిన సారథి ఏకే ఖాన్.. అవినీతి నిరోధక శాఖకు బదిలీ అయ్యారు. 1981 బ్యాచ్కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన అబ్దుల్ ఖయ్యూంఖాన్ గత కొంత కాలంగా ఆర్టీసీ ఎండీగా ఉంటూనే ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు.
అంతకుముందు ఆ పదవిలో ఉన్న బయ్యారపు ప్రసాదరావును డీజీపీగా నియమించినప్పటి నుంచి ఖాన్ జోడు పదవుల్లో ఉన్నారు. కాగా ఇప్పుడు ఆయనను పూర్తి స్థాయిలో ఏసీబీ డీజీగా నియమించారు. కాగా, ఆయన స్థానంలో 1988 బ్యాచ్కి చెందిన మరో సీనియర్ ఐపీఎస్ అధికారి జె.పూర్ణచంద్రరావును ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మొహంతి గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు.