ధర్మవరం రూరల్, న్యూస్‌లైన్ : ట్రాన్స్‌ఫార్మర్ కోసం లంచం డిమాండ్ చేసిన ట్రాన్స్‌కో ఏఈ ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మల్లాకాలువకు చెందిన ఎం.రామిరెడ్డి అనే రైతు 2012 ఫిబ్రవరిలో ట్రాన్స్‌ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన మెటీరియల్ మంజూరు కాగా, వాటిని రైతుకు ఇచ్చేందుకు ట్రాన్స్‌కో ఏఈ పశువుల మల్లయ్య రూ.4 వేలు డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వనిదే పని జరగదని తేల్చి చెప్పడంతో రూ. 3,500 ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న రైతు, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
దీంతో స్థానిక మార్కెట్ యార్డు వద్ద ఉన్న విద్యుత్ ఉపకేంద్రంలో కాపుగాసిన ఏసీబీ సిబ్బంది మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో రైతు నుంచి డబ్బు తీసుకుంటుండగా, ఏఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ నుంచి నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఈ దాడుల్లో సీఐలు గిరిధర్, ప్రభాకర్, మధ్యవర్తులుగా కార్మిక శాఖ ఉద్యోగులు సూర్యనారాయణ, రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ
Published Wed, Feb 5 2014 2:43 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement