
అధికారులపై నిఘా ఉంచాం: ఏకే ఖాన్
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అర్థరాత్రి నుంచి చెక్పోస్టుల్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ ఇప్పటివరకూ ఏడుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. అధికారులతో పాటు వారికి సహకరిస్తున్న ప్రయివేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నామని ఏకే ఖాన్ తెలిపారు.
సిబ్బందితో పాటు ఉన్నతాధికారులపై విచారణ జరిపిస్తామని ఏకే ఖాన్ పేర్కొన్నారు. ప్రజలతో మమేకం అయ్యే శాఖలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న అధికారులపై నిఘా ఉంచామన్నారు. ఈ సంవత్సరంలో 334 ట్రాప్ కేసులు, 36 తనిఖీ కేసులో, 21 అక్రమాస్తుల కేసులు నమోదు చేశామన్నారు.
అవినీతి అధికారులతో పాటు వారిని ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏకే ఖాన్ హెచ్చరించారు. సీబీఐ సహకారంతో కేసులు విచారణ మరింత వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏసీబీ తనిఖీలను విస్తృతం చేసేందుకు అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను సమకూర్చుంటున్నామని ఆయన తెలిపారు.