ఏసీబీకి చిక్కిన బీసీ కార్పొరేషన్ ఈడీ
- రూ.15వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
- వేములపూడి బాధితుల ఫిర్యాదుతో దాడి
- రిలీవ్‌కు ముందు రోజే పట్టివేత
విశాఖపట్నం : బదిలీ ఉత్తర్వులు అందుకుని రిలీవ్ అవ్వడానికి ముందు రోజే లంచం తీసుకుంటూ బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కె.జీవన్‌బాబు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కారు. నర్సీపట్నంలోని వేములపూడికి చెందిన సుర్ల ఆదినారాయణ, సుర్ల ఎర్రినాయుడు, కర్రినాయుడుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని మంగళవారం ఈడీని పట్టుకున్నారు. ఈ ఏడాది మార్చిలో ఆన్‌లైన్ ద్వారా బీసీ రుణం కోసం ఫిర్యాదుదారులు దరఖాస్తు చేసుకున్నారు.
వీరితోపాటే దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు మంజూరవడంతో వీరంతా ఈడీని సంప్రదించారు. ఒక్కొక్కరు రూ.5వేలు చొప్పున రూ.15 వేలు లంచమిస్తేనే రుణాలు మంజూరవుతాయని చెప్పడంతో వారంతా ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ సూచన మేరకు బాధితులు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం ఎంవీపీ కాలనీలోని బీసీ కార్పొరేషన్ ఈడీ జీవన్‌బాబుకి నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఆది నుంచీ లంచావతారమే!
బీసీ కార్పొరేషన్ ఈడీ జీవన్‌బాబుపై గతంలో కూడా పలు ఆరోపణలు వున్నాయి. రుణాల కోసం ఎవరు వచ్చినా లంచాల కోసం పీడించేవారని సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. రెండేళ్ల కిందట జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)కి ఐఎఫ్‌సీ కోడ్ నెంబర్ లేకపోవడంతో సదరు బ్యాంక్ రుణాలు చెక్కుల రూపంలోనే ఇచ్చేది. దీనిని అనుకూలంగా మార్చుకున్న జీవన్‌బాబు లబ్ధిదారులకు చెక్కు ఇవ్వాలంటే రూ.3వేల నుంచి రూ.4వేల వంతున లంచాలు తీసుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. బాధితులెవరూ ధైర్యంగా ఏసీబీకి ఫిర్యాదు చేయకపోవడంతో జీవన్‌బాబు ఆడింది ఆట పాడింది పాట చందంగా సాగిపోయిందని సిబ్బంది అంటున్నారు.
ఈయన బీసీ కార్పొరేషన్‌కి వచ్చి రెండేళ్ల పదినెలలు కావస్తోంది. డిప్యుటేషన్‌పై వచ్చి ఏడాది పూర్తయ్యాక హైదరాబాద్ వెళ్లి బీసీ కార్పొరేషన్‌లోనే ఉండేందుకు డిప్యుటేషన్‌ను పొడిగించుకున్నారు. జీవన్‌బాబు బీసీ కార్పొరేషన్ ఈడీగా వచ్చినప్పటి నుంచి ఇక్కడి సిబ్బందితో సత్సంబంధాలు లేవని, ఆ అంతర్గత విబేధాలే ఏసీబీ వలలో చిక్కేలా చేశాయని పలువురు చర్చించుకుంటున్నారు. డిప్యుటేషన్ పూర్తికావడంతో ఆయనకు సోమవారమే బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. దీంతో ఆయన ఏఈఓ ప్రసాద్‌కి బాధ్యతలు అప్పగించి రాష్ట్ర వికలాంగుల సంక్షేమశాఖలో రిపోర్టు చేయాల్సి ఉంది. మాతృశాఖ వికలాంగుల సంక్షేమ శాఖలోనూ వివాదాస్పదుడనే పేరుంది.