అనకాపల్లి అర్బన్, న్యూస్‌లైన్: మృతి చెందిన కూలీల కుటుంబాలకు సకాలంలో బీమా సొమ్ము అందించి ఆదుకోవలసింది పోయి... ఆ సొమ్ములో కొంత ముట్టజెబితేనే సంతకం చేస్తానని వేధించిన నర్సీపట్నం సహాయ కార్మిక శాఖాధికారి పాపం పండింది. కార్మిక సంఘం నేత నుంచి లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ పట్టుకుంది. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం సీతన్న అగ్రహారానికి చెందిన కార్మిక సంఘం నేత పాము అప్పలనాయుడు భవన నిర్మాణ కార్మికులకు రూ.110 చొప్పు న బీమా కట్టించాడు.
వీరిలో బంగారు గంగునాయుడు, మొల్లి నర్సింగరావు, వియ్యపు నూకలక్ష్మి 7 నెలల వ్యవధిలో మృతి చెందారు. ముగ్గురు కార్మికులు సహజంగా మరణించడం వల్ల ఒక్కొక్క కుటుంబానికి రూ.30 వేలు చెల్లించాలని కార్మిక శాఖకు అప్పలనాయుడు దరఖాస్తు చేసుకున్నాడు. అక్క డి సహాయ కార్మిక శాఖాధికారి కె.వి. ఎన్.ఎస్.రాజు ఒక్కొక్క మృతునికి సంబంధించి రూ.10 వేల చొప్పున ముట్టజెబితే తప్ప ఫైల్ మీద సంతకం చేసేది లేదని తేల్చిచెప్పాడు. దీంతో అప్పలనాయడు విశాఖలోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లి అక్కడ డీఎస్పీ ఎం. నర్సింహారావును ఆదివారం కలిసి విషయం తెలిపాడు.
అధికారుల సూచనల మేరకు బుధవారం రూ.20 వేలు ఇస్తానని సహాయ కార్మిక శాఖాధికారి కె.వి.ఎన్.ఎస్.రాజుకు చెప్పాడు. స్వగ్రామం పెందుర్తి వెళ్తూ మార్గమధ్యంలో అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని బుక్ స్టాల్ వద్ద ఉంటానని, అక్కడికి సొమ్ము తెచ్చివ్వాలని రాజు సూచించాడు. ముందుగా అనుకున్న ప్రకారం ఏసీబీ డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లు గణేష్, రమణమూర్తి, రామకృష్ణ, అప్పలనాయుడు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు బుధవారం సాయంత్రం చేరుకున్నారు.
అనంతరం ఏసీబీ డీఎస్పీ నరసింహారావు అందజేసిన రూ.20 వేలను అప్పలనాయుడు కాంప్లెక్స్‌లోని బుక్‌స్టాల్ వద్ద ఉన్న నర్సీపట్నం సహాయ కార్మిక శాఖాధికారి కె.వి.ఎన్.ఎస్.రాజుకు అందజేశారు. ఆయన నోట్లను లెక్కపెడుతుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాంప్లెక్స్ ట్రాఫిక్ మేనేజర్ కార్యాలయంలో నిందితుడిని డీఎస్పీ నరసింహారావు విచారించారు.
ఏసీబీకి చిక్కిన సహాయ కార్మిక శాఖాధికారి
Published Thu, Oct 24 2013 3:05 AM | Last Updated on Mon, May 28 2018 4:20 PM
Advertisement
Advertisement