హైదరాబాద్: పాతబస్తీలో మైనర్ బాలికపై రాక్షసంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితులలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. తలాబ్‌కట్టకు చెందిన 14 ఏళ్ల బాలికను ఓ స్నేహితుడు నమ్మించి బయటకు తీసుకువెళ్లాడు. ఆ తరువాత ఆ బాలికను ఓ వాహనంలో తిప్పుతూ అత్యాచారం చేశాడు. అతనే కాకుండా అతని స్నేహితులు మరో ముగ్గురు కూడా మానవ మృగాల్లాగా ఆ బాలికపై అత్యాచారం చేశారు. నలుగురు కలిసి సామూహికంగా అత్యాచారం చేసి ఆ బాలికను హింసించారు.
వివిధ ప్రాంతాలలో తిప్పుతూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితులు ఆటో డ్రైవర్ సల్మాన్, షేక్ ఇమ్రాన్, అజహర్, ఎండీ ఇమ్రాన్‌లుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై నిర్భయ చట్టం, ఐపీసీ 366 సెక్షన్ల కింద భవానీపురం పోలీసులు కేసులు నమోదు చేశారు.
దేశంలో అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కామాంధులు స్వైర విహారం చేస్తున్నారు. ప్రతిరోజూ ఎన్నో చోట్ల మహిళలు, బాలికలపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి. కామాంధులకు భయంలేదు. పసిమొగ్గలను కూడా ఈ కామపిశాచులు వదలడంలేదు. నిర్భయ చట్టం కాగితాలకే పరిమితమైపోయింది. ఈ చట్టానికి కూడా ఎవరూ భయపడటంలేదు.