- వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడు ధర్మాన
సాక్షి, విశాఖపట్నం : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై క్రియాశీలకంగా పనిచేసిన వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకే సమీక్ష సమావేశం నిర్వహించినట్టు వైఎస్సార్ సీపీ నేత, త్రిసభ్య కమిటీ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులు, నేతల అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు. వీటిపై ఓ నివేదిక రూపొందించి, పార్టీ అధిష్టానానికి విన్నవించనున్నట్టు వెల్లడించారు.
వ్యవస్థాపరంగా పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులపై విష ప్రచారమెక్కువగా జరిగిందన్నాన్నారు. కొత్త రాష్ట్రం, రాజధాని నిర్మాణంలో టీడీపీ అభూత కల్పనలతో మోసపుచ్చిందన్నారు. రైతు రుణ మాఫీ హామీ పనిచేసిందని అభిప్రాయపడ్డారు. విశాఖలో ఉత్తర భారత దేశానికి చెందినవారు ఓటర్లుగా భారీ స్థాయిలో ఉన్నారు. వారంతా మోడీవైపు మొగ్గు చూపారన్నారు.
లోక్‌సభ ఎన్నికలతో కలిపి కాకుండా కేవలం అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే నిర్వహించి ఉంటే ఫలితాలు ఆశాజనకంగా ఉండేవని ఎక్కువ మంది నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడినట్టు ధర్మాన తెలిపారు. సమావేశంలో పార్టీ నేతలు గుడివాడ అమర్‌నాథ్, వంశీకృష్ణ శ్రీనివాస్, తైనాల విజయ్‌కుమార్, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, కంపా హనోకు, పక్కి దివాకర్, గుడిమెట్ల రవిరెడ్డి, జోగినాయుడు పాల్గొన్నారు.