బల ప్రదర్శన | Additional police forces marched through the city's main roads in Anantapur | Sakshi
Sakshi News home page

బల ప్రదర్శన

Published Mon, Aug 19 2013 6:45 AM | Last Updated on Tue, Aug 21 2018 7:19 PM

Additional police forces marched through the city's main roads in Anantapur

 అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ :సమైక్య ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు అనంతపురంలో మోహరించిన అదనపు పోలీసు బలగాలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. బల ప్రదర్శనతో ప్రజలను భయాందోళనకు గురిచేయాలని పోలీసులు పన్నుతున్న కుట్రను ఎండగట్టేందుకు ప్రయత్నించారు. ఉద్యమం మరింత ఉధృతం కానుండటంతో పోలీసులు మరిన్ని అదనపు బలగాలను శనివారం రాత్రి నగరానికి రప్పించారు. ఆదివారం సాయంత్రం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో బల ప్రదర్శన (కవాతు) నిర్వహించారు. ఈ బలగాలు స్థానిక టవర్‌క్లాక్ వద్ద కవాతు ప్రారంభిస్తుండగా... సమైక్యాంధ్ర ఉద్యమనేతలు కొగటం విజయభాస్కర్‌రెడ్డి, నాగరాజుతో పాటు ఉద్యమకారులు అడ్డుపడ్డారు. 
 
 పోలీసులు వారిని నియంత్రించే క్రమంలోపెద్దఎత్తున తోపులాట జరిగింది. అనంతరం సమైక్యవాదులను అరెస్టు చేసి.. వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. ‘ఎస్పీ గోబ్యాక్’ అంటూ సమైక్యవాదులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అదనపు బలగాలను తక్షణమే జిల్లా నుంచి పంపేయాలంటూ డిమాండ్ చేశారు. ఉద్యమం శాంతియుతంగా జరుగుతుండగా.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం సరైంది కాదన్నారు. ఇప్పటిదాకా గాంధేయ మార్గంలో ఉద్యమం కొనసాగుతోందని, పరోక్షంగా పోలీసులే కలుషితం చేసి సమైక్యవాదులను జైళ్లలో పెట్టాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
 
 పైగా విద్యార్థులను ఉద్యమ ప్రారంభంలోనే తరిమి కొట్టి భయభ్రాంతులకు గురి చేశారని గుర్తుచేశారు. కాగా... ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ఎన్‌జీవో, విద్యార్థి జేఏసీలు, సమైక్యాంధ్రవాదులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ‘అనంత’ను ఆధీనంలోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుమారు 15 వేల మంది పోలీసులు విధుల్లో ఉండగా, మరో 13 వేల మందిని మోహరించారు. జిల్లాలో ఇంత మంది పోలీసులు అవసరమా అని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యమాన్ని అణచివేసే కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు.
 
 నగరంలో కవాతు
 అనంతపురం నగర ప్రధాన రహదారుల గుండా పోలీసు అదనపు బలగాలు కవాతు నిర్వహించాయి. టవర్‌క్లాక్ సర్కిల్ నుంచి ప్రారంభమైన కవాతు సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, ఆర్టీసీ బస్టాండు, తాడిపత్రి బస్టాండు మీదుగా కొనసాగింది. ఈ కవాతులో వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, టూటౌన్ సీఐ మన్సూరుద్దీన్, త్రీటౌన్ సీఐ దేవానంద్, సీసీఎస్ సీఐ శ్రీనివాసులు, రూరల్ సీఐ గురునాథబాబు, ఆత్మకూరు సర్కిల్ సీఐ విజయకుమార్, ఎస్‌ఐలు రెడ్డప్ప, ధరణికిశోర్, జీటీ నాయుడు, జాకీర్ హుస్సేన్‌తో పాటు పలువురు పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement