
బిల్లు తర్వాతే అడుగుతారేమో?
పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాతే కాంగ్రెస్ పెద్దలు టీఆర్‌ఎస్ విలీనం అంశంపై మాట్లాడతారేమోనని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాతే కాంగ్రెస్ పెద్దలు టీఆర్‌ఎస్ విలీనం అంశంపై మాట్లాడతారేమోనని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడుతున్నారు. రెండు, మూడు రోజులుగా మెదక్ జిల్లాలోని ఫాంహౌజ్‌లో తనను కలిసిన సన్నిహితులతో కేసీఆర్ చెబుతున్న అంశాల ప్రకారం.. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అంశంపై ఇప్పటికీ స్పష్టత లేనట్లుగా చెబుతున్నారు. అసలు ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కేసీఆర్‌తో మాట్లాడలేదని అంటున్నారు. హైదరాబాద్‌పై ఎలాంటి పేచీ, కిరికిరి లేకుండా తెలంగాణ ఇస్తే విలీనం చేయడానికి సిద్ధమేనని గతంలోనే మాట ఇచ్చామని వారు గుర్తుచేస్తున్నారు. ‘‘ఇప్పటికే ఇలాంటి చర్చలు చాలా జరిగాయి. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే తప్ప కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు. అందుకే ముందుగా ఎలాంటి చర్చలకూ తావివ్వకుండా, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే వారు మాట్లాడే అవకాశముంది.
అప్పటిదాకా విలీనంపై ఎవరైనా, ఏమైనా ఎలా చెప్పగలం’’ అని కేసీఆర్ తన సన్నిహితుడితో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఒకవేళ హైదరాబాద్‌పై ఎలాంటి కిరికిరీ లేకుండా తెలంగాణ ఇస్తే పార్టీపై నైతిక ఒత్తిడి ఉంటుందని, దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సీట్లే ముఖ్యం. పొత్తు పెట్టుకుంటే పార్లమెంటు సీట్లు కాంగ్రెస్‌కు, అసెంబ్లీ సీట్లు ఎక్కువ భాగం టీఆర్‌ఎస్‌కు ఉండే అవకాశాలను కూడా కాదనలేం. విలీనం జరిగితే తెలంగాణలో మరోపార్టీ పెరిగే అవకాశముంటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, తెచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్ మాత్రమే ఉండాలి. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసి తెలంగాణలో మరో పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఇప్పుడైతే ఇలాంటి దిశలోనే చర్చలు జరుగుతున్నాయి’’ అని వారు పేర్కొంటున్నారు.