
ఏజెన్సీ ఉద్రిక్తం
- నేటి నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు
- అడ్డుకోవడానికి పోలీసుల ప్రయత్నం
- మారుమూల గూడేలను జల్లెడపడుతున్న బలగాలు
- అయినా ఎస్‌ఆర్ పైపులైన్‌ను ధ్వంసం చేసిన దళసభ్యులు
- మన్యమంతటా భయాందోళనలు
పీఎల్‌జీఏ వారోత్సవాలతో ఏవోబీ వేడెక్కింది. పోలీసులు,మావోయిస్టుల సవాళ్లు,ప్రతిసవాళ్లతో యుద్ధవాతావరణం నెలకొంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారోత్సవాలను ఘనంగా నిర్వహించడంతోపాటు మిలీషియా, గ్రామ కమిటీల బలోపేతానికి దళసభ్యులు యోచిస్తున్నారు. అమరవీరుల స్తూపాల నిర్మాణాలను అడ్డుకోవడానికి పోలీసులు యత్నిస్తున్నారు. అనుమానితులపై నిఘా పెంచారు. ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. వెరశి మన్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పాడేరు/సీలేరు/పెదబయలు: మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టులకు పట్టున్న ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో ఇప్పటికే ముమ్మరంగా గాలిస్తున్నాయి. కొ య్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల గూడేలను స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, బీఎస్‌స్‌ఎఫ్ బలగాలు జల్లెడపడుతున్నాయి. దళసభ్యులకు సహకరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు ఇప్పటికే ప్రభావిత గ్రామాల్లో గిరిజనులతో సమావేశాలు నిర్వహించారు. స్తూపాల నిర్మాణాలకు ఎటువంటి సాయం అందకుండా పోలీసుశాఖ కఠినంగానే వ్యవహరిస్తోంది.
కాగా ఏవోబీలో అమర వీరులకు నివాళులర్పించేందుకు దళసభ్యులు వారం రోజుల క్రితం నుంచే పెదబయలు, ముంచంగిపుట్టు, ఒడిశా సరిహద్దుల్లో స్తూపాల నిర్మాణం చేపడుతున్నారు. మిలీషియా, గ్రామ క మిటీలు బలోపేతం పనిలో నిమగ్నమయ్యారు. రాత్రిళ్లు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వారోత్సవాల్లో ఎక్కువ మందిని పితూరి సేనలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
మారుమూల గూడేల్లో ఉద్యోగుల సేవలపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. విధులకు డుమ్మాకొట్టే ఉపాధ్యాయులు, వీఆర్వోల వివరాలు సేకరిస్తున్నట్టు భోగట్టా. దీంతో మారుమూల గూడేలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆయా గ్రామాల గిరిజనులు ఎక్కడికి వెళ్లలేని దుస్థితి. ఒడిశా చిత్రకొండ ప్రాంతంలో శుక్రవారం ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని దళసభ్యులు కాల్చి చంపడంతో ఇరు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. వారోత్సవాలకు ముందే రక్తం చిందించడంతో ఏవోబీలో రెడ్‌అలెర్ట్ ప్రకటించారు.
పోలీసు బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చేపడుతున్నప్పటికీ శనివారం రాత్రి ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కోరుకొండ-బలపం సమీపంలో ఎస్‌ఆర్ పైపులైన్‌ను ధ్వంసం చేసి మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో మైదానానికి వెళ్లాలంటూ హిట్‌లిస్టులో ఉన్న ప్రజాప్రతినిధులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. పోలీసుస్టేషన్ల సమీపంలోని గ్రామాల్లో తనిఖీలు చేపడుతున్నారు.
మారుమూల ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేటు వాహనాలు కూడా సోమవారం నుంచి నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. పెదవలస, జర్రెల, కోరుకొండ, మద్దిగరువు, బూసిపుట్టు ప్రాంతాలకు వాహనాలను నడపరాదని ప్రైవేటు ఆపరేటర్లు నిర్ణయించుకున్నారు. పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశా. అనుమానితుల కదలికలపై నిఘా అధికమైంది. వారోత్సవాల్లో మున్ముందు ఎటువంటి సంఘటనలను చూడాల్సి వస్తుందోనని ఈ ప్రాంత గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో ఏవోబీలో యుద్ధ వాతావరణం నెలకొంది.
వారోత్సవాలను అడ్డుకుంటాం
డీఎస్పీ అశోక్‌కుమార్
చింతపల్లిరూరల్: మావోయిస్టు వారోత్సవాలను అడ్డుకుంటామని డీఎస్పీ ఇ.జి.అశోక్‌కుమార్ అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఏవోబీతో పాటు మన్యంలో గ్రేహాండ్స్, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ బలగాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నామన్నారు. మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడానికే పలు ప్రాంతాల్లో దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే వారి కార్యకలాపాలతో విసిగిన మావోయిస్టు సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు స్వచ్ఛంధంగా లొంగిపోతున్నారన్నారు. సంస్మరణ వారోత్సవాల సభలు, నిర్వహణకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలన్నింటినీ గుర్తించి ఆయా ప్రాంతాలలో బలగాల గస్తీ పెంచామన్నారు. గిరిజనులు సైతం మావోయిస్టు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, గ్రామాలలో అనుమానితులెవరైనా సంచరించినా తమ దృష్టికి తీసుకు రావాలన్నారు.