ప్రభుత్వం రైతులకు ఇస్తున్న సబ్సిడీలను సంక్షేమ పథకాల వ్యయంలో భాగంగా చూడటం తగదని, ఈ ఖర్చును దేశాభివృద్ధికి చేస్తున్న ఖర్చుగా
ప్రపంచ వ్యవసాయ సదస్సు ముగింపు సమావేశంలో స్పీకర్ మనోహర్
సదస్సు సిఫారసుల అమలుకు కృషి: మంత్రి కన్నా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రైతులకు ఇస్తున్న సబ్సిడీలను సంక్షేమ పథకాల వ్యయంలో భాగంగా చూడటం తగదని, ఈ ఖర్చును దేశాభివృద్ధికి చేస్తున్న ఖర్చుగా పరిగణించాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. హెచ్‌ఐసీసీలో మూడు రోజులుగా జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు ముగింపు సమావేశంలో గురువారం స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తరిగిపోతున్న ప్రకృతి వనరులు, కూలీల కొరత, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే సంసిద్ధత లోపించడం వంటి సమస్యలతో వ్యవసాయ రంగం సతమతమవుతోందన్నారు. రాష్ట్ర వ్యవసాయ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతుల అభివృద్ధికి సదస్సు చేసిన సిఫారసుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
విలువల రాజకీయాలు కావాలి: జేమ్స్ బోల్గర్
ప్రపంచంలో కోట్లాది మంది ఆకలి తీర్చడానికి, సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయం గిట్టుబాటుగా మార్చడానికి చిత్తశుద్ధి కల్గిన రాజకీయ నాయకత్వం కావాలని ప్రపంచ వ్యవసాయ ఫోరం (డబ్ల్యూఏఎఫ్) సలహా మండలి చైర్మన్ జేమ్స్ బోల్గర్ పేర్కొన్నారు. చిన్న కమతాలకు అనువుగా వ్యవసాయ యాంత్రీకరణ జరగాలన్నారు. డబ్ల్యూఏఎఫ్ నేత బెకర్ మాట్లాడుతూ సదస్సు అనుకున్న దానికన్నా బాగా విజయవంతమయ్యిందన్నారు. సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికే మహంతి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిల్ చంద పునేఠ తదితరులు మాట్లాడారు.
నిరసనల మధ్య ముగిసిన సదస్సు
రైతు సంఘాల నిరసనల మధ్య మూడు రోజుల ప్రపంచ వ్యవసాయ సదస్సు గురువారంతో ముగిసింది. ఈ కార్యక్రమాన్ని పలు రైతు సంఘాలు బహిష్కరించాయి. సదస్సులో పాల్గొని చర్చల తీరును ఎండగట్టాలని భావించిన కొందరు రైతు నేతలను పోలీసులు లోపలికి అనుమతించలేదు. సదస్సు చివరి రోజు కూడా నిరసన తెలిపిన పలువురు రైతు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, చర్చల్లో బహుళజాతి కంపెనీల వ్యాపార విస్తరణ ధోరణిని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు తగిన రీతిలో ఎండగట్టడం విశేషం. విదేశీ కంపెనీల ప్రతినిథులు కొత్త టెక్నాలజీ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ ఉండాల్సిన అవసరాన్ని మన శాస్త్రవేత్తలు గట్టిగా చెప్పారు. కర్ణాటక వ్యవసాయ యూనివర్సిటీ మాజీ వీసీ పాటిల్, ఐసీఏఆర్ ఇంజనీరింగ్ మాజీ డీడీజీ ఎంఎం పాండే, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ వీసీ రాజ్‌కుమార్ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ముల్కనూర్ సొసైటీ విజయ గాథ!
కరీంనగర్ జిల్లా ముల్కనూర్ సొసైటీ సాధించిన ఘన విజయం ప్రపంచ వ్యవసాయ సదస్సులో ప్రతినిధులను అమితంగా ఆకట్టుకుంది. 1956లో కేవలం రూ.2,300 మూలధనంతో ఈ సొసైటీ ప్రారంభమైంది. ప్రస్తుతం 7,300 మంది రైతుల భాగస్వామ్యంతో రూ.10 కోట్ల షేర్ కేపిటల్‌తో రూ.180 కోట్ల టర్నోవర్ సాధించిన వైనంపై సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రధానంగా విదేశీ ప్రతినిధులను ఆకట్టుకుంది. బయటి వ్యక్తుల ప్రమేయాన్ని అంగీకరించకపోవడం.. నిబద్ధత, నిజాయితీ కలిగిన స్థానిక నాయకత్వం.. సకాలంలో రైతులకు రుణాలివ్వడం.. రుణ వసూళ్లను మార్కెటింగ్‌తో అనుసంధానించడం వల్లే తమ సొసైటీ ఇంత అభివృద్ధి సాధించిందని ప్రవీణ్ రెడ్డి వివరించడంతో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.