సాక్షి ప్రతినిధి, విజయనగరం :భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణంపై ఎయిర్‌పోర్టు అథారటీ అధికారులు తొలుత ఇచ్చిన నివేదికపై సాంకేతిక సహాయ సంస్థ(కన్సల్టెన్సీ ఏజెన్సీ)అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపాదిత ప్రాం తంలో కొండలు ఉండటం వల్ల సాంకేతిక సమస్యలొస్తాయని, అలైన్‌మెంట్‌లో మార్పు చేయాలని కన్సల్టెన్సీ ఏజెన్సీ ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో మరోసారి సాంకేతిక కోణంలో అధ్యయనం చేయాలని
ఎయిర్‌పోర్టు అథారిటీకి సర్కార్ చూసింది. దానిపై ఇంకా తుది నివేదిక రాలేదు. అయినా భూసమీకరణ పేరుతో రైతుల్ని భయబ్రాంతులకు గురి చేసింది. 15,200 ఎకరాలు అవసరమని అధికారుల్ని రంగంలోకి దించింది. ల్యాండ్ పూలింగ్ కింద భూములిస్తే సరే..లేదంటే భూసేకరణతోనైనా లాక్కుంటామని హెచ్చరించింది. ఇంత చేసినా సర్కార్... సాంకేతికంగా నేటికీ స్పష్టత సాధించలేకపోయింది. తుది నివేదిక వచ్చాక ఈ ప్రాంతం అనుకూలం కాదని చెబితే యూటర్న్ తీసుకోవల్సిందే.
కానీ రెండు నెలలుగా గాలిలో మేడలు కట్టినట్టు వేర్వేరు ప్రకటనలు చేసి రైతుల్ని గందరగోళానికి గురి చేస్తోంది. ప్రభుత్వం నడిపిన హైడ్రామాలో చోటు చేసుకున్న పరిణామాలివి. ఏప్రిల్ 26వ తేదీన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి కిమిడి మృణాళిని ఆధ్వర్యంలో విజయనగరం డీఆర్‌డీఏ సమావేశం మందిరంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఎయిర్‌పోర్ట్‌కు 15వేల ఎకరాలు సేకరిస్తున్నట్టు వెల్లడించారు. రాజధాని తరహా ప్యాకేజీని అమలుచేస్తామని, భూములిచ్చిన రైతులకు 16రకాల ప్రయోజలను కల్పిస్తామని ప్రకటించారు.
ఈనెల 3 న ఎయిర్‌పోర్టును కేవలం ఆరు వేల ఎకరాల్లోనే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ స్వయంగా ప్రకటన విడుదల చేశారు. ఆ మరుసటి రోజున విశాఖపట్నంలో విజయనగరం, విశాఖ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అదే ప్రకటన చేశారు. ఈనెల 13న జిల్లాకొచ్చిన పురపాలక మంత్రి పి.నారాయణ ఎయిర్‌పోర్టుపై చేసిన సమీక్షలో ఐదువేల ఎకరాలైతే సరిపోతాయని, ఆమేరకు భూ సమీకరణ చేయాలని సీఎం చంద్రబాబునాయుడు తమకు సూచించారని చెప్పారు. అంతటితో ఆగకుండా ఐదు వేల ఎకరాలు కావొచ్చు...నాలుగు వేలు అవ్వొచ్చు..మూడు వేలు సరిపోవచ్చు... 1000,1500ఎకరాల్లోనైనా నిర్మించొచ్చు అంటూ స్పష్టత లేని ప్రకటన చేశారు. గతంలో 15వేలు ఎకరాలని ఎందుకు ప్రకటించారని అడిగితే మిస్ ఫైర్ అయ్యిందని చెప్పారు.
తాజాగా 15న కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మీడియాతో మాట్లాడుతూ మూడు వేల ఎకరాల్లోనే భోగాపురం ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా భిన్నమైన ప్రకటనలు చేసి రైతులతో మైండ్ గేమ్ ఆడుతోంది.. రైతుల నుంచి రియాక్షన్ తెలుసుకునేందుకు నాటకమాడుతోంది. రైతులు ఒప్పుకుంటే పెద్ద ఎత్తున భూసమీకరణ చేసి, వ్యాపారం చేసుకుందామని భావించింది. కానీ, రైతులు సమష్టిగా వ్యతిరేకించడంతో సర్కార్ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. దీంతో సమీకరించే ఎకరాల మొత్తాన్ని దశల వారీగా తగ్గిస్తూ వచ్చింది. కానీ, దేనికీ రైతుల నుంచి సానుకూలత రాలేదు. అంత భూమి ఎందుకుని ప్రపంచంలో ఉన్న ఎయిర్‌పోర్టుల విస్తీర్ణాన్ని చెబుతూ రైతులు తిప్పికొట్టారు. చివరికీ, 3వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు సర్కార్ చెప్పుకొస్తోంది.
ఎందుకో అత్యుత్సాహం?
Published Wed, May 20 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement
Advertisement