మాట తప్పితే మళ్లీ పోరాటం
కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ
రావులపాలెం : ఎన్నికల ముందు టీడీపీ మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం మాట తప్పితే మళ్లీ ఉద్యమం తప్పదని కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ హెచ్చరించారు. తుని ఘటన నేపథ్యంలో అరెస్టు అయి 14 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ఆయన బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. తొలుత కిర్లంపూడి వెళ్లి, అక్కడి నుంచి స్వగ్రామమైన గోపాలపురం చేరుకున్నారు. ఆలమూరు మండలం మీదుగా ఆయన ఊరేగింపుగా రావులపాలెం చేరుకున్నారు. స్థానిక కళా వెంకట్రావు సెంటర్‌లో ఆయనకు రావులపాలెం శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం అధ్యక్షుడు నందం వీరవెంకట సత్యనారాయణ, గోపాలపురం ఉప సర్పంచ్ అధికార నాగేశ్వరరావు, మండల కాపు సంఘం అధ్యక్షుడు సాధనాల శ్రీనివాసు ఆధ్వర్యంలో పెద్దఎత్తున కాపు సామాజిక వర్గీయులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రామకృష్ణ తుని ఘటనలో అమాయకులపై కేసులు పెట్టబోమని, నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని ఆనాడు చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారని గుర్తుచేశారు. నేడు అమాయకులను అరెస్టులు చేయడంతో ముద్రగడ తన కుటుంబ సభ్యులతో కలసి దీక్ష చేపట్టారన్నారు. కాపుల ఉద్యమంపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఏ ఒక్క వర్గానికి నష్టం జరగకుండా ప్రత్యేక కేటగిరీలో రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అన్నారు.
ఏ వర్గానికి నష్టం కలిగేలా ఉన్నా తమకు రిజర్వేషన్లే వద్దని పేర్కొన్నారు. తమ ఉద్యమం ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. అన్ని పార్టీలు, కులాలతో పాటే ఉద్యమంలో ముందుకు సాగుతామన్నారు. కాపు సామాజిక వర్గీయులు ఇదే చైతన్యాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పారు. ర్యాలీలో పీసీసీ జాయింట్ సెక్రటరీ పొనుగుపాటి శ్రీనివాస్, నాయకులు బండారు బాబీ, సాధనాల సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు జవ్వాది రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.