దరఖాస్తులు ‘ఫుల్’
మద్యం దరఖాస్తులు మంచి కిక్ ఇచ్చాయి. దుకాణాలకు లెసైన్సు పొందేందుకు ఆశావహులు పోటీ పడ్డారు. ఆఖరి రోజైన శుక్రవారం దరఖాస్తుదారులు క్యూ కట్టారు. జిల్లాలోని 232 మద్యం దుకాణాలను కైవసం చేసుకునేందుకు పోటాపోటీగా తరలిరావడంతో అంబేద్కర్ ఆడిటోరియం కిటకిటలాడింది. మద్యం దుకాణాలు పొందేందుకు మహిళలు కూడా బారులు తీరారు. శనివారం జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు.
శ్రీకాకుళం క్రైం: జిల్లాలోని మద్యం దుకాణాలను కైవసం చేసుకునేందుకు దరఖాస్తుదారులు ఎగబడ్డారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దరఖాస్తుదారులతో అంబేద్కర్ ఆడిటోరియం కిటకిటలాడింది. వ్యాపారుల సౌలభ్యం కోసం ఒకే ఈఎండీతో ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చంటూ ఎక్సైజ్‌శాఖ ఇచ్చిన ఆఫర్‌ను దరఖాస్తుదారులు బాగానే సద్వినియోగం చేసుకున్నారు. అమావాస్య కావడంతో మంచి సమయం కోసం వేచి ఉండి చివరి రోజు మధ్యాహ్నం నుంచి దరఖాస్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.
జిల్లాలో 232 మద్యం దుకాణాలకు సంబంధించి ఎక్సైజ్‌శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. మొదటి రోజు మంగళవారం ఒక దరఖాస్తు కూడా దాఖలు కాకపోగా, రెండో రోజు బుధవారం ఏడు దరఖాస్తులు మాత్రమే దాఖలయ్యాయి. మూడో రోజు గురువారం 90 దుకాణాలకు సంబంధించి 293 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం సుమారు 1500 దరఖాస్తులు వచ్చాయి. మధ్యాహ్నం నుంచి శుభఘడియలు రావడంతో అధికమంది బ్యాంకుల్లో డీడీలు తీసి దరఖాస్తులతో అంబేద్కర్ ఆడిటోరియంకు పరుగులు తీశారు.
దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది వారి స్థోమత బట్టి దుకాణాలకు టెండర్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంతో దరఖాస్తుల స్వీకరణ సమయం ముగిసింది. అయితే, ఆడిటోరియంలోకి చేరుకున్నవారందరి నుంచి ఎక్సైజ్‌శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రక్రియ రాత్రి 12 గంటల వరకు సాగింది. మొత్తమ్మీద ఈ ఏడాది అధిక సంఖ్యలో దరఖాస్తులు దాఖల య్యాయనే చెప్పాలి. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగలక్ష్మీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. శనివారం మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులను లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించనున్నారు.
మహిళల హడావుడి..
మద్యం దుకాణాలు కైవసం చేసుకునేందుకు పురుషులతో సమానంగా మహిళలు కూడా పోటీ పడ్డారు. ఓ వైపు మహిళా సంఘాల ప్రతి నిధులు మద్యపాన నిషేధానికి పాటుపడు తుండగా... మద్యం దుకాణాలు కైవసం చేసుకునేందుకు పలువురు మహిళలే స్వయం గా దరఖాస్తు చేసుకోవడం పలువురిని ఆలో చనలో పడేసింది.
21 దుకాణాలకు దరఖాస్తులు నిల్...
రణస్థలం పరిధిలోని 15 దుకాణాలకు 14 దుకాణాలకు 207 దరఖాస్తులు, నరసన్నపేట పరిధిలో 18 దుకాణాలకు గాను 17 దుకాణాలకు 149 దరఖాస్తులు, పలాస పరిధిలో 98 దుకాణాలకు 80 దుకాణాలకు 623 దరఖాస్తులు వచ్చాయి. పాలకొండ 16 దుకాణాలకు గాను 15 దుకాణాలకే దరఖా స్తులు వచ్చాయి. శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో 22 దుకాణాలకు సుమారు 400 వరకు దరఖాస్తులు దాఖలయ్యాయి. మొత్తంమీద 232 దుకాణాల్లో సుమారు 21 దుకాణాల వరకు దరఖాస్తులు దాఖలు కాలేదు.