అలేఖ్య.. లవ్ చీటర్ ! | Alekhya Reddy cheats 5 men in the name of love | Sakshi
Sakshi News home page

అలేఖ్య.. లవ్ చీటర్ !

Published Tue, Dec 3 2013 4:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM

అలేఖ్య.. లవ్ చీటర్ !

అలేఖ్య.. లవ్ చీటర్ !

వేములవాడ, న్యూస్‌లైన్ : వేములవాడకు చెందిన పూర్ణచందర్ ప్రేమ పేరుతో తనను వంచించాడని, న్యాయం చేయాలని అతడి ఇంటిముందు బైఠాయించి నానారభస చేసిన అలేఖ్యరెడ్డి అమాయకురాలేమీ కాదు.. ఆమె కూడా ఓ పెద్ద మోసగత్తె అనే విషయం ఆలస్యంగా తెలిసింది. బీటెక్ స్టూడెంట్‌నని, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌నని రకరకాల హోదాలు చెప్పి యువకులతో పరిచయాలు పెంచుకోవడం.. కొద్దిరోజుల తర్వాత ప్రేమిస్తున్నానంటూ వలపుల వల వేయడం.. తర్వాత  తనను మోసం చేశాడంటూ కేసులు పెట్టి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేయడం.. ఇదీ ఆమె అసలు నైజం! అలేఖ్య వలలో చిక్కుకుని ఆమె భర్తతోపాటు నలుగురు యువకులు కేసులపాలు కాగా.. పూర్ణచందర్ అయిదో వ్యక్తి.

అతడు తనను మోసం చేశాడంటూ ఫొటోలు చూపించి స్థానికులను, పోలీసులను, మీడియాను సైతం  తప్పుదారిపట్టించింది. పూర్ణచందర్ కూడా అలేఖ్య దారిలోనే వెళ్లి ఆమె వలలో చిక్కుకున్నాడు. పూర్ణచందర్-అలేఖ్య వ్యవహారంపై ‘ప్రేమాయకుడు’ శీర్షికతో ‘సాక్షి’లో వచ్చిన కథనం హైదరాబాద్ టాబ్లాయిడ్‌లోనూ ప్రచురితమైంది. ఈ కథనాన్ని చదివిన సరూర్‌నగర్ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ దివ్యారెడ్డి స్పందించి అలేఖ్య అసలు చరిత్రను బయటపెట్టారు.


 వలపుల వలలో చిక్కితే అంతే..
 వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన అలేఖ్యరెడ్డి ఉరఫ్ బుజ్జీ ఉరఫ్ హేమ పసితనంలోనే తల్లి మరణించడంతో తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. అలేఖ్య విద్యాభ్యాసం కోసం హైదరాబాద్ వెళ్లి ఉమెన్ ్స హాస్టల్‌లో ఉంటూ చదువుకుంది. ఈక్రమంలోనే రవీందర్ అనే వ్యక్తిని వివాహమాడింది. కొంతకాలానికి రవీందర్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులపై సరూర్‌నగర్ మహిళా పోలీస్టేషన్‌లో వేధింపుల కేసుపెట్టింది. క్రైం నంబర్ 14/13 ప్రకారం 420, 498(ఎ) 3అండ్4/డీపీ యాక్ట్ కేసులు బాధితులపై నమోదయ్యాయి.


  *  చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 385/12 ప్రకారం.. జగ దీశ్వర్ అనేవ్యక్తిపై చీటింగ్, కిడ్నాప్ 324,509 కింద కేసులు పె ట్టింది. ఇక్కడా బాధితుడు బోరుమన్నాడు.
 *  మరో వ్యక్తిపై క్రైం నంబర్ 62/13 ప్రకారం 342, 366, 307, 506, ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్లతో కేసుపెట్టింది.


  తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న పూర్ణచందర్ ఆమె వలలో చిక్కాడు. ప్రేమపేరిట తనను వంచించాడని, కిడ్నాప్‌చేసి వేధించాడని పేర్కొంటూ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో క్రైం  నంబర్ 421/13 ప్రకారం 420, 323, 506 కేసులు పెట్టింది. దీంతో పూర్ణచందర్‌తోపాటు అతడి తల్లిదండ్రులు రాధ, రాంచందర్ రిమాండ్ కాలాన్ని జైల్లో గడిపారు. ఇటీవలే విడుదలైన వీరు వేములవాడకు వచ్చారు. ఇది తెలుసుకున్న అలేఖ్యరెడ్డి శనివారం రాత్రి వేములవాడకు వచ్చి అతడి ఇంటిముందు బైఠాయించి కొ త్త డ్రామాకు తెరలేపింది.ఈమె రాకతో పరు వుపోతుందని భావించిన వీరు ఇంటికి తా ళంవేసి వెళ్లిపోయారు. దీంతో అలేఖ్య ఆరోపణలు నిజమేనని స్థానికులు నమ్మేశారు.


 ఆమె ఓ చీటర్
 సరూర్‌నగర్ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ దివ్యారెడ్డి సోమవారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్‌లో మాట్లాడారు. సరూర్‌నగర్ ఆర్‌ఐగా చెప్పుకున్న అలేఖ్యరెడ్డి పెద్ద మోసగత్తె అని ఆమె చెప్పారు. గతంలో ఉప్పల్ ఆర్‌ఐగా చెప్పుకొని స్థానికులకు ల్యాండ్ పోజిషన్ సర్టిఫికెట్లు ఇప్పించే పేరిట పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు తెలిపారు. జంటనగరాల్లో మహిళా ఆర్‌ఐలున్న రెవెన్యూ కార్యాలయాన్ని గుర్తించి.. అందుకనుగుణంగా తనపేరును మార్చుకుని ఆ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గతంలో గుర్తించారని వెల్లడించారు.


 పూర్ణచందర్ సైతం..
 వేములవాడకే చెందిన ఓ యువతిని పూర్ణచందర్ మూడేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో ఆమెను వదిలేశాడు. అనంతరం హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రి మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు. పెళ్లి చేసుకుందామనుకునే సమయంలో అనుకోకుండా అలేఖ్యరెడ్డితో పరిచయం ఏర్పడింది.

తనను సరూర్‌నగర్ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా పరిచయం చేసుకున్న అలేఖ్య... తన తల్లి తహశీల్దార్‌గా మరణించిందని, ఆమె స్థానంలో తనకు కారుణ్య నియామకాల్లో భాగంగా రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా ఉద్యోగం దక్కిందని చెప్పింది. తన జీతంతోపాటు తల్లి పింఛన్, ఇంటి కిరాయిలు కలిపి నెలకు రూ.లక్ష ఆదాయం ఉంటుందని పేర్కొంది. ఇవన్నీ నమ్మిన పూర్ణచందర్ ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఇంకేముంది ఆమె పాచిక పారింది. మూడు నెలలు తిరక్కుండానే ఇలా అడ్డంగా బుక్కైపోయాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement