అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి
ఏలూరు : జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర అటవీ శాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయి మెజార్టీ అందించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా తొలుత జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని క్యాబినెట్ సమావేశంలో స్పష్టం చేశారని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో ఆక్వాకల్చర్ అభివృద్ధికి, హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు, నేషనల్ ఇనిస్ట్యిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. చింతలపూడి ప్రాంతంలో బొగ్గు నిల్వలు వెలికితీతను పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. వ్యవసాయం, చేపల చెరువుల రైతుల జీవనవిధానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొల్లేరును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అదేక్రమంలో కొల్లేరు ప్రాంత ప్రజలకు ఎటువంటి నష్టం లేనివిధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎంపీలు మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యేలు బడేటి కోట రామారావు, గన్ని వీరాంజనేయులు, కలవపూడి శివరామరాజు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో మంత్రి మొక్కలు నాటారు.