
సాక్షి, అమరావతి: ఆహారం, నిత్యావసర సరుకులన్నిటికీ లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉందని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ స్పష్టం చేసింది. వీటి రవాణాకు ఎక్కడా, ఎలాంటి ఆంక్షలు లేవని కూడా పేర్కొంది. అంతర్ రాష్ట్ర రవాణా మినహాయింపులపై రాష్ట్ర ప్రభుత్వాలు మరింత స్పష్టతతో చర్యలు తీసుకోవాల్సి ఉందని, లేదంటే నిత్యావసర సరకుల సరఫరా చైన్ దేశ వ్యాప్తంగా దెబ్బతింటుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
లేఖలో పేర్కొన్న అంశాలివీ
► నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, పశువుల దాణా, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ ఉత్పత్తులు, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజ్‌లు, వాటికి సంబంధించి ముడి పదార్థాలు, హ్యాండ్ వాష్, సబ్బులు, టూత్ పేస్ట్, దంత సంరక్షణ వస్తువులు, షాంపూ, సర్ఫేస్ క్లీనర్స్, డిటర్జెంట్స్, శానిటరీ పాడ్స్, చార్జర్స్, బ్యాటరీల రవాణాకు ఆంక్షల నుంచి సడలింపు ఉంది.
► ల్యాబొరేటరీలకు, ఇ–కామర్స్ విక్రయాలు, నిత్యావసర సరకుల ఉత్పత్తి, సరుకుల రవాణాకు మినహాయంపు ఉంది.
► నిత్యావసర సరకుల రవాణా, ఉత్పత్తులకు సంబంధించిన కార్యకలాపాలకు జిల్లాల అధికారలు వ్యక్తిగత పాస్‌లు ఇవ్వాలి.
► లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన వస్తువుల కంపెనీలు, ఆర్గనైజేషన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు ఆథరైజేషన్ లెటర్స్ ఇవ్వాలి.
► రైల్వే, ఎయిర్ పోర్టు, పోర్టుల్లో కార్గో సర్వీసులను అనుమతించాలని స్పష్టం చేసినా కొన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం పాస్‌లు ఇవ్వడం లేదు. వీటికి లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంది.
► నిత్యావసర సరుకుల లోడింగ్, అన్ లోడింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పాస్‌లు జారీ చేయాలి.
► అంతర్ రాష్ట్ర రవాణా వాహనాల్లో ఒక డ్రైవర్, మరో వ్యక్తిని అనుమతించాలి. నిత్యావసర సరుకులు తీసుకు రావడానికి వెళ్లే ఖాళీ వాహనాల్లో ఒక డ్రైవర్, అదనంగా ఒక వ్యక్తిని స్థానిక అథారిటీలు అనుమతించాలి.
► కోవిడ్–19 టెస్టింగ్ ప్రైవేట్ ల్యాబ్‌లకు, టెస్టింగ్ నమూనాల సేకరణ కేంద్రాలు, వాటిని రవాణాకు మినహాయింపు ఉంది.