బాక్సైట్ తవ్వకాలకు అనుమతులపై అఖిల పక్షాల నిరసన
ఐక్య ఉద్యమానికి సమాయత్తం
నేడు మన్యం బంద్
ఉద్రిక్తత నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ అధికారుల పర్యటన
శీతాకాలం ఆరంభంలో ఏజెన్సీ ఒక్కసారిగా వేడెక్కింది. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో మన్యంలో నిరసనాగ్ని రగులుకుంది. సర్కారు వైఖరికి వ్యతిరేకంగా మన్యం బందుకు సిద్ధమైంది. ప్రాణాలు పణంగా పెట్టయినా ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటామని పాడేరులో అఖిలపక్షాలన్నీ ఒకతాటిపైకి వచ్చి తేల్చి చెప్పాయి. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ప్రతిన బూనాయి. వైఎస్సార్‌సీపీతో సహా వామపక్షాలు.. ఇతర రాజకీయ పార్టీలు ఇందులో పాల్గొన్నాయి.
పాడేరు : విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో అఖిలపక్షాల్లో నిరసన పెల్లుబికింది. శుక్రవారం పలు మండలాల్లో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. జీకేవీధి, చింతపల్లి, పాడేరు, పెదబయలు మండలాల్లో విపక్షాలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలను నిర్వహించాయి. జి.మాడుగుల మండలంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి అనంతరం సభను బహిష్కరించి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ధర్నా, ర్యాలీ నిర్వహించారు. పాడేరులో అఖిలపక్షాలు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. రాజకీయ పార్టీలు, పీసా, విద్యార్థి కమిటీలు సమావేశమై బంద్‌కు పిలుపునిచ్చాయి.
బాక్సైట్ ఉద్యమంలో అందరి భాగస్వామ్యం: ఎమ్మెల్యే ఈశ్వరి
మన్యంలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవడానికి ఐక్య ఉద్యమం చేపట్టాలని, ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ గిరిజన భవన్‌లో శుక్రవారం నిర్వహించిన అఖిలపక్షాల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏజెన్సీ 11 మండలాల్లో ఆదివాసీ ప్రజలను సంఘటితం చేసి ఉమ్మడి పోరుతోనే బాక్సైట్‌ను అడ్డుకోగలమన్నారు. ఆదివాసీలంతా వ్యతిరేకిస్తున్నా, పర్యావరణానికి గిరిజనుల మనుగడకు విఘాతమని తెలిసినా ప్రభుత్వం నిరంకుశంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చిందని ధ్వజమెత్తారు.
ప్రకృతి సంపదపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెగబడుతున్నాయని, మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపడితే ప్రజా ప్రతిఘటన తప్పదని మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు హెచ్చరించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఏపీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలన వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీ గిరిజన సంఘం, సీపీఎం నాయకులు ఆర్.శంకరరావు, ఎంఎం శ్రీను, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పాలికి అప్పారావు, సీపీఐ నాయకుడు కూడా భూషణరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాంగి సత్తిబాబు, బీజేపీ నాయకులు ఉమా మహేశ్వరరావు, వేమనబాబు, సల్ల రామకృష్ణ, బీఎస్పీ నాయకులు సుర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
నిర్ణయం మార్చుకోకుంటే టీడీపీకి గుడ్‌బై
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన 97 జీఓను ఉపసంహరించాలని మాజీ మంత్రి మణికుమారి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ వి.కాంతమ్మ, అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, టీడీపీ నాయకులు బొర్రా నాగరాజు, ఎంవిఎస్ ప్రసాద్, శెట్టి లక్ష్మణుడు, పాంగి రాజారావు, జి.మాడుగుల జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఓ హరినారాయణన్‌కు వినతిపత్రం అందజేసి ఐటీడీఏ వద్ద నిరసన తెలియజేశారు. మన్యంలో ఆదివాసీలంతా వ్యతిరేకిస్తున్న బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతివ్వడం భావ్యం కాదన్నారు. ఈనెల 13న తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగే సమావేశానికి హాజరై బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన జీఓను ఉపసంహరించాలని కోరనున్నట్లు తెలిపారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం పూనుకుంటే పార్టీ నుంచి వైదొలుగుతామని పేర్కొన్నారు.
నిరసన సెగ
Published Fri, Nov 6 2015 11:11 PM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM
Advertisement