సాక్షి, అమరావతి: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. గ్రామ, వార్డు వలంటీర్లు అర్హుల జాబితాను రూపొందించి, సమర్పించిన తర్వాత దానిని గ్రామసభలో చదివి వినిపించాలని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హులను తొలగించాలని, అర్హుల పేర్లు లేకపోతే గ్రామసభలో చర్చించి చేర్పించాలని పేర్కొన్నారు. ఇందుకు షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ‘‘లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సెప్టెంబర్ 25వ తేదీలోగా పూర్తి చేయాలి. 30వ తేదీలోగా ఎక్కడ ఎంత భూమి కావాలో ఖరారు చేసి, తదనుగుణంగా నివేదికలు రూపొందించాలి. ఇప్పటికే ఇల్లు లేదా ఇంటి స్థలం పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేస్తే తిరస్కరించాలి. డూప్లికేషన్‌ను నివారించడానికి ఆధార్‌ను జత చేయడం తప్పనిసరి చేయాలి’’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ పంపిన ఆదేశాల్లో పేర్కొన్నారు.
నేటి నుంచి ఉప ముఖ్యమంత్రి సమీక్షలు
25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని సజావుగా పూర్తి చేయడానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు నేటి నుంచి తేదీ నుంచి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజుతో కలిసి జిల్లాల్లో పర్యటించాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ నిర్ణయించుకున్నారు. జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించి అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేస్తారు. ‘‘నిష్పక్షపాతంగా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నాం. ఇంత తక్కువ కాలంలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేదల పట్ల ఉన్న అభిమానానికి, ముందుచూపునకు ఇది నిదర్శనం’’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు.
30,152.73 ఎకరాల భూమి గుర్తింపు
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అధికారులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటిదాకా 30,152.73 ఎకరాల భూమిని గుర్తించారు. రాష్ట్రంలో 1,45,72,861 కుటుంబాలుండగా, 1,26,26,879 కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రామ, వార్డు వాలంటీర్లు సేకరించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. 25,64,897 కుటుంబాల వారు ఇళ్ల స్థలాలు పొందడానికి అర్హులని తాత్కాలికంగా నిర్ణయించారు. 1,00,61,982 కుటుంబాల వారు నివాస స్థలాలు పొందడానికి అనర్హులని తాత్కాలికంగా తేల్చారు. మిగిలిన కుటుంబాల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తికాగానే గ్రామసభలు నిర్వహించి, లబ్ధిదారుల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు.
ఇందులో అనర్హుల పేర్లు ఉన్నట్లు తేలితే తొలగిస్తారు. అర్హుల పేర్లు జాబితాలో చేరలేదని తేలితే పునఃపరిశీలిస్తారు. అర్హులని తేలితే జాబితాలో చేరుస్తారు. రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఎవరూ ఉండరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన భూమిని సమకూర్చే పనిని వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీనాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే ఏడాది మార్చి 25న ఉగాది సందర్భంగా అర్హులందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment