
జనసంద్రమైన ఆళ్లగడ్డ
వైఎస్సార్ సీపీ నేత భూమా నాగిరెడ్డి అంతిమయాత్ర సందర్భంగా ఆళ్లగడ్డ జనసంద్రమైంది
కర్నూలు: వైఎస్సార్ సీపీ నేత భూమా శోభా నాగిరెడ్డి అంతిమయాత్ర సందర్భంగా ఆళ్లగడ్డ జనసంద్రమైంది. శుక్రవారం ఉదయం ఆమె భౌతిక కాయాన్నివేలాది సంఖ్యలో అభిమానులు సందర్శించారు. అనంతరం మధ్యాహ్నం ఆమె అంతిమ యాత్ర ఆరంభమైంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అభిమానులు ఆమె అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. శోభా నాగిరెడ్డి పార్థీవ దేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో ఆళ్లగడ్డ మొత్తం స్తంభించింది. ఆమె ముగింపు కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహిని కన్నీటి పర్యంతమైయ్యారు. ఇక తమ నేత తిరుగురాదని తెలిసి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఆ దుఃఖాన్ని అదిమిపెట్టుకుంటూనే శోభమ్మ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. జిల్లాలోని ఆళ్లగడ్డలో ఆమె అంత్యక్రియల కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు.
రాష్ట్ర రాజకీయాల్లో మృధుస్వభావిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శోభా నాగిరెడ్డి ప్రస్థానం ముగిసిపోవడంతో రాష్ట్రం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. బుధవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన శోభా నాగిరెడ్డి.. నిన్న చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. గురువారం ఆమె పార్థీవదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం నంద్యాలలో ఉంచారు. శోభమ్మ ఇక లేరని తెలిసి రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతికి లోనైయ్యారు. శోభా నాగిరెడ్డి భౌతికకాయాన్ని అంతిమ యాత్రగా తీసుకుళ్లే ముందు ఆమె భర్త భూమా నాగిరెడ్డి కన్నీటిని దిగమింగుకుని అక్కడకు వచ్చిన వారికి చేతులు జోడించి అభివాదం చేయడం అందర్నీ కలచివేసింది.