అమలాపురం డీఎస్పీగా ఎల్.అంకయ్య నియమితులయ్యారు. విజయవాడ ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న ఈయన బదిలీపై ఇక్కడికి వస్తున్నారు.
అమలాపురం టౌన్ : అమలాపురం డీఎస్పీగా ఎల్.అంకయ్య నియమితులయ్యారు. విజయవాడ ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న ఈయన బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. అంకయ్యకు జిల్లాతో 20 ఏళ్ల అనుబంధం ఉంది. ఆరు పోలీసు స్టేషన్లలో ఎస్సైగా, రెండు చోట్ల సీఐగా పనిచేశారు. 1989 ఎస్సై బ్యాచ్‌కు చెందిన అంకయ్య జిల్లాలోని వై.రామవరం, సామర్లకోట, పిఠాపురం, జగ్గంపేట, అనపర్తి, కొత్తపేటల్లో ఎస్సైగా పనిచేశారు. రాజమండ్రి టౌన్, రాజమండ్రి రూరల్, రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐగా బాధ్యతలు నిర్వహించారు. హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహానికి గురైన అమలాపురం డీఎస్పీ ఎం.వీరారెడ్డి డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. ఈయన స్థానంలో తొలుత రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ రామచంద్రరావు నియమితులయ్యారు. అయితే ఆయన అమలాపురం వచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో ఆయన బదిలీ ఆగింది. తర్వాత జరిగిన బదిలీల ప్రక్రియలో అంకయ్య నియమితులయ్యారు. కొత్త డీఎస్పీ మంగళవారం బాధ్యతలు స్వీకరించాక వీరారెడ్డి రిలీవ్ కానున్నారు.
కోనసీమ నాకు కొట్టిన పిండే
జిల్లాలో ఎస్సై, సీఐగా 20 ఏళ్ల పాటు పనిచేయడం, కోనసీమలోని కొత్తపేట ఎస్సైగా పనిచేసిన అనుభవంతో ఈ ప్రాంతం తనకు కొట్టిన పిండేనని కొత్త డీఎస్పీ అంకయ్య అన్నారు. విజయవాడ నుంచి ఆయన సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. కోనసీమ పరిస్థితులకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పనిచేస్తానన్నారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై తక్షణం స్పందించేలా చర్యలు చేపడతానన్నారు.