పది నెలల పాలన అస్తవ్యస్తం
వైఎస్సార్ సీపీ నేత అంబటి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఏపీలో తన 10 నెలల పాలన అస్తవ్యస్తంగా తయారవడంతో సీఎం చంద్రబాబు తీవ్ర నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రధానంగా ఐదు అంశాల్లో ఎదురైన వైఫల్యాల వల్ల బాబుకు ఈ నిరాశ ఏర్పడిందన్నారు. ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు.
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై బాబు ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోందన్నారు. నిరాయుధులైన కూలీలను పట్టుకెళ్లి కాల్చి చంపారని తమిళ పత్రికలు సహా తెలుగు పత్రికలు కూడా రాశాయన్నారు. హైకోర్టు కూడా పోలీసులపై సెక్షన్ 302 కింద కేసెందుకు నమోదు చేయలేదని ప్రభుత్వంపై అక్షింతలు వేసిందన్నారు. జాతీయ హక్కుల సంఘాలు కూడా ఎన్‌కౌంటర్‌ను ఖండించినట్టు చెప్పారు.
బెదిరించి పాలన సాగించలేరు..
తుపాకీ గొట్టాలు, పోలీసు లాఠీలతో ప్రజలను బెదిరించి పాలన సాగించలేరని చంద్రబాబు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిదని అంబటి హితవు పలికారు.
రోజాను వేధిస్తున్నారు..
ప్రజా సమస్యలపై టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోరాడుతున్న మహిళా ఎమ్మెల్యే రోజాపై ఎస్సీ కేసులు పెట్టించి మరీ వేధిస్తున్నారని అంబటి అన్నారు.