
నేడు విజయవాడకు అమిత్ షా
* రాష్ట్రంలో బీజేపీ బలోపేతమే లక్ష్యం
* రేపు రాష్ట్ర నేతలకు బీజేపీ అధ్యక్షుడి దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారి పర్యటనకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. గురువారం ఆయన తొలిసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ వచ్చిన అమిత్ షా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలు ముగించుకున్న అనంతరం గురువారం రాత్రి విజయవాడ చేరుకుంటారు.
శుక్రవారం ఉదయం రాష్ట్రానికి చెందిన పార్టీ ముఖ్య నేతలతో, సాయంత్రం జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జీలు, జిల్లా పరిశీలకులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీ కీలక శక్తిగా తీర్చిదిద్దడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉండడం, రాష్ట్రంలోనూ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉండడాన్ని ఆసరా చేసుకొని.. వీలైనంత మంది పేరున్న నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించనున్నారు.
అమిత్ షా రాక సందర్భంగా పార్టీలో చేరికలపై పార్టీ నేతలు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడి పర్యటనలో ఇతర పార్టీ నేతల చేరికలకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక ఖరారు కాలేదని రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలు చెబుతున్నారు. బీజేపీలో చేరికకు ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆసక్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అలాంటి నేతలందరూ అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పర్యటనలో చేరికలపై అమిత్‌షా పెద్దగా దృష్టి సారించడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేతలతో సమావేశం అనంతరం అమిత్ షా శుక్రవారం సాయంత్రం ఢిల్లీ తిరిగి వెళతారు.