సాక్షి, అమరావతి: జగనన్న అమ్మఒడి పథకం విద్యావ్యవస్థలో ఓ పెద్ద సంస్కరణగా పలువురు మంత్రులు, శాసనసభ్యులు అభివర్ణించారు. రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాకుండా అక్షరాస్యతలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. లక్షలాది మంది తల్లులు తమ పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. అమ్మఒడి పథకానికి రూపకల్పన చేసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనీయుడని కొనియాడారు. అమ్మఒడి పథకం– లక్ష్యాలపై రాష్ట్ర మంత్రి కె.కన్నబాబు మంగళవారం అసెంబ్లీలో స్పల్పకాలిక చర్చను ప్రారంభించారు. అమ్మ ఒడితో సంక్రాంతి కంటే ముందుగానే పండుగ వచ్చిందని తల్లులు సంతోష పడ్డారన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన దేశంలో ఎక్కడా లేదని మంత్రి కన్నబాబు అన్నారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని, సీఎం స్వయంగా రూపొందించిన మధ్యాహ్న భోజన మెనూ ఈరోజు నుంచే అన్ని పాఠశాలల్లో అమలవుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పిన దానికంటే ఎక్కువగా ఇస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల నెలవారీ వేతనాన్ని రూ. వేయి నుంచి రూ.3 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దే అని చెప్పారు. పాఠశాలలు నాడు–నేడు కార్యక్రమంతో వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయని కన్నబాబు చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా సీఎంను అభినందించాలి
జగనన్న అమ్మఒడి పథకం కేవలం సంక్షేమ పథకం కాదు.. ఓ సంస్కరణ పథకం అని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొనియాడారు. సమాజ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మఒడి పథకాన్ని రూపొందించారని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు కేవలం ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు పసుపు కుంకుమ, పండుగలకు పప్పు బెల్లాలు పంచారని, కానీ సీఎం వైఎస్ జగన్ పేదలు, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత స్థానాలను చేర్చేందుకు అమ్మఒడి పథకంతో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ముఖ్యమంత్రిని అభినందించాలని పేర్కొన్నారు. ఈ పథకంతో పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుతున్నానని చెప్పారు. ఇటువంటి మంచి పథకంపై జరుగుతున్న చర్చలో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో లేకపోవడం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదవుకున్న వ్యక్తిగా తాను ‘అమ్మ ఒడి’ పథకానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
జగన్ అంటే ఒక బ్రాండ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే పేరు కాదని, అదో బ్రాండ్ అని, చెప్పాడంటే చేస్తాడంతే– అనేది ట్యాగ్‌లైన్ అని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అభివర్ణించారు. చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్ అని చెప్పేవారని, ఇప్పుడు ఏ ఫర్ అమ్మఒడి అని చెప్పే విధంగా ఈ పథకం ఉందన్నారు. అ అంటే అమ్మఒడి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని అక్షరాలు దిద్దేలా నిలిచిపోయే చారిత్రకమైన పథకం అని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద బిడ్డకు సంక్రాంతి పండుగకు మేనమామ మాదిరిగా జగన్ అమ్మఒడి కానుకను తెచ్చారన్నారు.
చరిత్రను తిరగరాసిన రోజు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకువచ్చిన జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు బడుగు, బలహీన వర్గాల పాలిట పెద్ద వరమని ఎమ్మెల్యే సీహెచ్ అప్పలరాజు కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకంతో ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కుమారుడు వైఎస్ జగన్ మరో రెండడుగులు ముందుకు వేసి విద్యను ఉద్యమ రూపంలో సంస్కరించేందుకు నడుంకట్టారన్నారు. అమ్మఒడి సంక్షేమ పథకం కాదని, అదో విప్లవాత్మక సంస్కరణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన స్వానుభవాలు, చంద్రబాబుపై సెటైర్లు సభికులను ఆకట్టుకున్నాయి. అమ్మఒడిని ప్రారంభించిన జనవరి 9 ఏపీ చరిత్ర తిరగరాసిన రోజు అన్నారు.
మంచి చెప్పినా టీడీపీలో వినే పరిస్థితి లేదు
మంచి చెప్పినా తెలుగుదేశం పార్టీలో వినే పరిస్థితి లేదని ఆ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాళి గిరిధరరావు అన్నారు. అమ్మఒడి లాంటి అద్భుతమైన పథకంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేతతో సహా ఆ పార్టీ సభ్యులు సభలో లేకపోవడం పేద పిల్లల చదువుపట్ల వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందన్నారు. జగనన్న అమ్మఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడు వంటి పథకాలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో సీఎం వైఎస్ జగన్ సంస్కరణలు తీసుకొస్తున్నారని చెప్పారు. అమ్మఒడి పథకం పట్ల బడుగు, బలహీన వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు.
కూల్చడానికి సినిమా సెట్టింగులు కాదు
ఢిల్లీ వెళ్లి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ఓ నాయకుడు ప్రగల్భాలు పలుకుతున్నాడంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. కూల్చేయడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏమీ సినిమా సెట్టింగులు కాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే కొన్ని కోట్ల కుటుంబాల సమూహం అన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆ సినీ హీరో పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతు ఇస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ జగన్‌ను జైల్లో నిర్బంధిస్తా అన్న కాంగ్రెస్, టీడీపీలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న మరో నాయకుడు మూడు రాజధానులను అడ్డుకునేందుకు రాజకీయ భిక్షగాడి పాత్ర పోషిస్తున్నారని ఆయన విమర్శించారు.
మనసుతో చూసినప్పుడే ఇది సాధ్యం
ప్రజల కష్టాలను మనసుతో చూడడం వల్లే అమ్మఒడి లాంటి అద్భుత పథకాలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టగలిగారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్ అన్నారు. జగన్ అంటే నిజం, నిజమంటే జగన్ అనేది రుజువైందని, తన కలను జగన్ సాకారం చేశారని చెప్పారు.
పేదల గుండెల్లో జగన్‌కు గుడి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ యతిప్రాసలతో, కవితలతో చేసిన ప్రసంగం సభను ఆకట్టుకుంది. ’జనవరి నైన్త్– జనానికి స్ట్రెంగ్త్’ అన్నారు. ’పేదవాళ్లకు ఉండదు తడి (డబ్బు అనే అర్థంలో), వారి గుండెల్లో కట్టుకున్నారు జగనన్నకు గుడి.. అదే జగనన్న అమ్మఒడి, ఇదే చదువుల బడి’ అంటూ ఆయన ఆసు కవితను చదివినప్పుడు సభికుల నుంచి అభినందనలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment