సేలంలో 'అనంత' యువతిపై అత్యాచారం
అనంతపురం : అనంతపురం జిల్లాకు చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పోలీసులు కేరళ యువకుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే జిల్లాలో బెలుగుప్ప మండలం కలుపల్లికి చెందిన ఏడుగురు యువతులు కోయంబత్తూరులోని ఓ ప్రయివేట్ వస్త్ర కర్మాగారంలో పని చేస్తున్నారు. కలుపల్లిలో జరిగే తిరునాళ్లకు వారిని తీసుకు వెళ్లేందుకు యువతుల బంధువులు వచ్చారు.
వారు కోయంబత్తూరు నుంచి బెంగళూరు వెళ్లి, అక్కడ నుంచి అనంతపురం రావటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. వీరంతా శనివారం రాత్రి కన్యాకుమారి నుంచి బెంగళూరు వెళ్లే ఐల్యాండ్ ఎక్స్ప్రెస్ రైలులో ఎక్కారు. రైలు రాత్రి రెండు గంటల సమయంలో సేలం రైల్వేస్టేషన్కు అయిదు కిలోమీటర్ల ముందు ఉన్న సిగ్నల్ వద్ద ఆగింది. ఆ సమయంలో ఏడుగురిలో ఓ యువతికి చెందిన పర్సు రైల్లో నుంచి కిందపడిపోయింది. దీంతో ఆమె కిందకు దిగగా, వెంటనే రైలు కదిలిపోయింది.
కాగా అదే రైల్లో పక్క బోగీలో ప్రయాణిస్తున్న కేరళకు చెందిన హరి ....యువతి దిగటం చూసి అతడు కిందకు దిగాడు. రైలు వెళ్లిపోవటంతో ఒంటరిగా ఉన్న యువతిని పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఈ ఘటనపై బాధితురాలు గేట్ కీపర్కు ఫిర్యాదు చేసింది. సూరమంగళం రైల్వే పోలీసులు హరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.