నవ వసంతం.. తొలి వెలుగు.. | Anantapur Development Is A High Priority In The Budget | Sakshi
Sakshi News home page

నవ వసంతం.. తొలి వెలుగు..

Published Sat, Jul 13 2019 8:10 AM | Last Updated on Sat, Jul 13 2019 8:11 AM

Anantapur Development Is A High Priority In The Budget - Sakshi

ఎన్నికల హామీలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ 
మాటంటే మాటే 
► ‘‘రాజకీయ పార్టీలను చూడం.. కులం  చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం. ఎన్నికల్లో మాత్రమే రాజకీయాలు చేయాలి. ఆ తర్వాత అభివృద్ధి, సంక్షేమమే పరమావధి.’’    -సీఎం వైఎస్‌ జగన్‌
► నియోజకవర్గ ఎమ్మెల్యేలకు రూ.కోటి చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధి కేటాయింపు. కేవలం అధికారపక్ష ఎమ్మెల్యేలకు మాత్రమే కాకుండా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఈ నిధి కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం. 

రైతు ప్రభుత్వం 
►హెచ్‌ఎల్‌సీ, హంద్రీనీవా, భైరవానితిప్ప ప్రాజెక్టులకు రూ.1,345 కోట్ల నిధులను కేటాయించింది. 
►ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.7లక్షల మేర అందించేందుకు బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. ఫలితంగా జిల్లాలోని 200 పైగా రైతుల కుటుంబాలకు ఆసరా లభించనుంది.  
►వైఎస్సార్‌ రైతు భరోసా కింద జిల్లాలోని రైతులకు రూ.12,500 చొప్పున అక్టోబర్‌లో రబీ పంటకు పెట్టుబడి సహాయం కింద ప్రభుత్వం అందించనుంది. 
►రైతాంగానికి ఉచితంగా 9 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు ఉచితంగా బోర్లు వేయించేందుకు కూడా నిధుల కేటాయింపు జరగడం విశేషం. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: నవరత్నాల మేనిఫెస్టో అమలు దిశగా మొదటి బడ్జెట్‌లోనే ప్రభుత్వం పెద్దపీట వేసింది. రైతులు.. మహిళలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమంతో పాటు తోపుడుబండ్ల వ్యాపారులు.. డప్పు కళాకారులతో పాటు ఇతర సామాజిక వర్గాలకు పింఛను పథకాన్ని అమలు చేసేందుకు అనుగుణంగా నిధులను కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం భారీగానే నిధులు వెచ్చించనుంది. జగనన్న అమ్మ ఒడి పథకం కింద బడికి పంపే తల్లులకు రూ.15 వేల చొప్పున సహాయం అందనుంది. ఇక సాంకేతిక విద్యతో పాటు ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు అనుగుణంగా పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిజిటల్‌ తరగతులు, కొత్త భవనాల నిర్మాణం జరగనుంది.

అదేవిధంగా ఎస్‌కే యూనివర్సిటీకి రూ.55 కోట్లు, జేఎన్‌టీయూకు రూ.60 కోట్ల మేర నిధులను కేటాయించారు. వైద్యరంగంలో కూడా పెనుమార్పులు రానున్నాయి. 104, 108 సర్వీసులను అభివృద్ధి చేసేందుకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు ఐదారు రెట్ల మేర పెరగడంతో మండలానికో 108 వాహనం ఇక నుంచి రోడ్లపై పరుగులు పెట్టి ఆపదలో ఉన్న వారిని ఆదుకోనుంది. 108 వాహనాలకు బడ్జెట్‌ మొత్తం రూ.34 కోట్ల నుంచి రూ.143 కోట్లకు, 104 సంచార వైద్యానికి రూ.61 కోట్ల నుంచి రూ.179 కోట్లకు పెరిగింది. ఇందుకు అనుగుణంగా జిల్లాకు కూడా 108 పథకానికి రూ.12 కోట్లు, 104 సంచార వైద్యానికి రూ.15 కోట్ల మేర నిధులు వచ్చే అవకాశం ఉంది. 

అనంతపురం టు అమరావతి :
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ కొత్త రాజధాని అమరావతికి సరైన రోడ్డు మార్గం లేదు. ఈ నేపథ్యంలో అనంతపురం నుంచి అమరావతి రాజధానికి జాతీయ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో రహదారి నిర్మాణానికి భూసేకరణ సమస్య తీరడంతో పాటు రహదారి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యేందుకు ముందడుగు పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

రైతన్నలకు నేనున్నానంటూ..
త్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు చనిపోయిన కుటుంబానికి రూ.7లక్షలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా రూ.100 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న 200 పైచిలుకు రైతు కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు తీరిపోయేందుకు అవకాశం ఏర్పడింది. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద బడ్జెట్‌లో రూ.8,500 కోట్లు కేటాయించగా.. ఇందులో జిల్లాలోని లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. వాస్తవానికి వచ్చే ఏడాది ఖరీఫ్‌ సీజను నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని అనుకున్నప్పటికీ రైతుల స్థితిగతులను గమనించి... ఈ ఏడాది రబీ నుంచే రైతులను ఈ పథకం ద్వారా ఆదుకోవాలని నిర్ణయించింది. ఇక 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌తో లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా సాగునీటి వనరులు లేక జిల్లాలోని రైతులు బోర్లపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బోర్లను వేయించేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించగా... జిల్లాలోని రైతులకు భారీగా లబ్ధి చేకూరనుంది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా కింద రైతులు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. ధరల స్థిరీకరణ నిధిని కేటాయించడంతో ప్రతీ పంటకు గిట్టుబాటు ధర లభించనుంది.
 
బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా.. :
రాష్ట్ర బడ్జెట్‌లో బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా డప్పు కళాకారులకు గతంలో అందిరికీ కాకుండా కేవలం కొద్ది మందికి మాత్రమే పింఛను అందుతోంది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.25 కోట్లు మాత్రమే కేటాయించగా.. ఈ ఏడాది ఏకంగా రూ.118 కోట్లు కేటాయించారు. ఫలితంగా జిల్లాలోని డప్పు కళాకారులందరికీ అర్హతను బట్టి పింఛను అందనుంది. అదేవిధంగా తోపుడుబండి వారికి కూడా పింఛను పథకం అమలుకానుంది. మరోవైపు వైఎస్సార్‌ పెళ్లికానుక కింద బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం సహాయం అందించనుంది. ఇక డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు వడ్డీ లేని రుణాలు ఠంచనుగా అందనున్నాయి. ఇక పేదలందరికీ కూడా అటు పట్టణ, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి భారీగానే ప్రభుత్వం నిధులను కేటాయించింది.  

మారనున్న విద్యా స్వరూపం :  పాలిటెక్నిక్‌ కాలేజీల భవనాల నిర్మాణంతో పాటు డిజిటల్‌ క్లాస్‌ తరగతుల ఏర్పాటుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన భారీగా జరగనుంది. రెండేళ్ల కాలాన్ని గడువుగా పెట్టుకుని మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రణాళిక రచించింది. ఉన్నత విద్యారంగంలో  జేఎన్‌టీయూ        (ఏ)కు రూ.60 కోట్లు, ఎస్కేయూకు రూ.55 కోట్లు కేటాయించారు. అన్నింటికి మించి జVýæనన్నఅమ్మ ఒడి పథకం కింద పాఠశాలలతో పాటు ఇంటర్మీడియట్‌ చదివే ప్రతీ విద్యార్థినీ, విద్యార్థి తల్లులకు రూ.15 వేల చొప్పున ప్రభుత్వం అందివ్వనుంది. తద్వారా రాష్ట్రంలో నిరక్షరాస్యత పారదోలడంతో పాటు చదువు భారం కాకుండా నేనున్నానంటూ ఒక అన్నలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ పథకాన్ని అమలు చేయనుండటంతో ఇప్పటికే జిల్లాలో పాఠశాలలకు పంపే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు డ్రాప్‌అవుట్స్‌ పూర్తిగా తగ్గాయనే చర్చ జరుగుతోంది. ఇక 8, 9, 10 చదువుకునే అమ్మాయిలకు ప్రత్యేకంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు న్యాప్‌కిన్లను ప్రభుత్వమే సరఫరా చేయనుంది. తద్వారా బాలికా విద్యాభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement