నీ దూకుడు.. తాడిపత్రి చూడు! | Anantapur New SP Filed Many Cases Against Punters In Tadipatri | Sakshi
Sakshi News home page

నీ దూకుడు.. తాడిపత్రి చూడు!

Published Wed, Jun 26 2019 10:25 AM | Last Updated on Wed, Jun 26 2019 10:26 AM

Anantapur New SP Filed Many Cases Against Punters In Tadipatri - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అనంతపురం: జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న సత్య యేసుబాబు విధినిర్వహణలో తనదైన దూకుడు కనబరుస్తున్నారు. ఈనెల 9న విధుల్లో చేరిన ఆయన ఇప్పటి వరకు ఒక్క తాడిపత్రి నియోజకవర్గంలోనే వంద మందికి పైగా అసాంఘిక శక్తులను అరెస్టు చేయించారు. వీళ్లందరిపైనా గతంలో కేసులు నమోదైనా అక్కడి ‘బ్రదర్స్‌’ కొమ్ముకాశారు.

అయితే సత్య యేసుబాబు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించడంతో అరెస్టుల పర్వం మొదలైంది. రాప్తాడు, ధర్మవరం తదితర సమస్యాత్మక ప్రాంతాలపైనా ఆయన గట్టి నిఘా సారించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాడిపత్రిలో వేళ్లూనుకున్న ‘మట్కా.. పేకాట.. బెట్టింగ్‌’ ఎస్పీకి ఓ సవాల్‌ అనే చెప్పాలి.

జేసీ బ్రదర్స్‌ కనుసన్నల్లో తాడిపత్రి నాలుగు దశాబ్దాలకు పైగా నలిగిపోయింది. ఆ ప్రాంతంలో వాళ్లు చెప్పిందే వేదం.. చెసిందే శాసనం. అలా మొదలైన కథ.. ఏ అధికారి వచ్చినా ఆ కనుసన్నల్లో మెలగాల్సిందే. పోలీసులదీ అదే దారి. ఈ నేపథ్యంలోనే తాడిపత్రి జూద గృహంగా మారిపోయింది. డీఎస్పీలు.. సీఐలు.. ఎస్‌ఐలు.. ఎవరు మారినా ఆ మహమ్మారికి ముకుతాడు వేయలేకపోయారు. పైగా ఆ ఊబిలో కూరుకుపోయారు.

అక్కడి నేతలు ప్రజలకు కనీస అవసరాలైన మంచినీటిని అందించలేకపోయినా.. వాళ్ల అనుచరులు పేకాట, మట్కా, బెట్టింగ్‌ను మాత్రం వీధివీధికీ విస్తరించారు. ఏ స్థాయిలో అంటే.. అడ్డొస్తే పోలీసులైనా దాడులకు తెగబడేంతగా. గత ఏడాది ఓ సీఐపై మట్కా డాన్‌ రషీద్‌ దాడులకు పాల్పడినా అక్కడి ప్రజాప్రతినిధులు బాధ్యతను విస్మరించారు.

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏకంగా పోలీసులకు వ్యతిరేకంగా, మట్కారాయుళ్లకు అండగా పోలీసుస్టేషన్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఇలాంటి పాలనలో పోలీసులు కూడా మౌనం దాల్చడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ ధైర్యం చేసినా.. బదిలీకి సిద్ధపడాల్సిందే.

ఈ కారణంగా అసాంఘిక శక్తులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. పోలీసు శాఖలోని కీలక అధికారుల కొత్త వాహనాలకు నెలవారీ కంతులు, ఇతర ఖర్చులకు ఈ ముఠాలే సర్దుబాటు చేస్తుండటంతో ప్రతినెలా జూదం ‘కోట్లు’ దాటింది. 

జూద కేంద్రంగా తాడిపత్రి 
తాడిపత్రిలో పేకాట ఆడేందుకు కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల నుంచి కూడా వస్తుంటారు. ఇక్కడ రూ.లక్ష, రూ.2లక్షల బ్యాంకు ఆట కూడా జరుగుతుంది. మునిసిపాలిటీలోని పాలకవర్గం సభ్యుడు ఒకరు ఇక్కడ పేకాటక్లబ్‌లకు ఇన్‌చార్జి. ఇతను జేసీ బ్రదర్స్‌కు నమ్మిన బంటు. గతంలో ఇతని ఇల్లే పేకాట క్లబ్బు.

తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్‌ పరిశ్రమలు అధికం. అల్ట్రాటెక్, పెన్నా సిమెంట్స్‌తో పాటు గెర్డావ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఉంది. వీటిలో పనిచేసేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఎక్కువగా సిబ్బంది వస్తుంటారు. ఆర్థికలావాదేవీలు కూడా ఎక్కువే. దీన్ని ఆసరగా చేసుకుని అక్కడి కొంతమంది నేతలు తమ అనుచరులతో పేకాట నిర్వహిస్తున్నారు. దీన్ని కూడా స్థానిక నేతలు ఆదాయమార్గంగా ఎంచుకున్నారు.

ఇక పక్కనే ప్రొద్దుటూరు ఉండటంతో క్రికెట్‌ బెట్టింగ్‌ కూడా అధికంగా నడుస్తోంది. అనంతపురం జిల్లాలో జరిగే బెట్టింగ్‌ తాడిపత్రి కేంద్రంగానే సాగుతోంది. అదేవిధంగా మట్కా సంగతి చెప్పక్కర్లేదు. గతంలో అశోక్‌కుమార్‌ ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 72మంది మట్కారాయుళ్లను తాడిపత్రి నుంచి బహిష్కరించారు. అయితే ఆ తర్వాత నేతల ఒత్తిడి పెరగడంతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. 

పోలీసుల నిస్సహాయత 
ఇక్కడ పేకాట, మట్కా ఎవరు నిర్వహిస్తున్నారు? బెట్టింగ్‌ బుకీలు ఎవరు? అనే సంగతి అక్కడి పోలీసులకు తెలియనిది కాదు. అయినా ఎలాంటి చర్యలు ఉండవు. ఏమాత్రం జోక్యం చేసుకున్నా అక్కడి ఓ మాజీ ప్రజాప్రతినిధి, ఆయన పీఏ నుంచి ఫోన్లు రావడం సర్వసాధారణం. పోలీసులతో రాయ‘బేరాలు’ నడిపి నెలమామూళ్లు కట్టిపడేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ నేపథ్యంలోనే బదిలీ కంటే బహుమానాలే ఉత్తమమనే భావన ఉన్నట్లు కనిపిస్తుంది.

పోలీసులే మౌనం దాలిస్తే వ్యవహారం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. తాడిపత్రిలో అధిక భాగం వ్యసనాలకు బానిసైంది. అప్పుల ఊబిలో ఎన్నో కుటుంబాలు ఉక్కిరిబిక్కిరి కాగా.. హత్యలు, ఆత్మహత్యలు కోకొల్లలు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు.

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా అసాంఘిక శక్తుల నుంచి తాడిపత్రికి విముక్తి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇప్పటికే తనదైన ముద్ర కనపరుస్తున్న నూతన ఎస్పీ చేతుల్లో తాడిపత్రి ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి. 

డిసెంబర్‌ 30, 2018 
మట్కా డాన్‌ రషీద్‌ను అరెస్టు చేసేందుకు వచ్చిన సీఐ హమీద్‌ఖాన్‌పై ఆయనతో పాటు అనుచరులు దాడి చేశారు. పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. సీఐతో పాటు పోలీసులు గాయపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement