► విభాగాల వారీగా విస్తృత పరిశీలన
► ఐదు విభాగాలకు ప్రశంస
► అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎస్పీ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన న్యాక్ పీర్ కమిటీ వర్శిటీలోని విభాగాల వారీగా గురువారం పరిశీలించింది. సైన్స్ విభాగాల్లోని పరిశోధనలు, అకడమిక్ పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని విభాగాల్లో జాతీయ స్థాయిల్లోని ప్రమాణాలకు తీసిపోని విధంగా ఉన్న పరిశోధనల పట్ల పీర్ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. న్యాక్ పీర్ కమిటీ గురువారం ఉదయం 9 గంటలకు వర్సిటీ పాలకభవనం వద్దకు చేరుకోగానే ఎంపీఈడీ విద్యార్థులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఎస్కేయూ వీసీ ఆచార్య కే.రాజగోపాల్‌తో భేటీ అయ్యారు.
ఐక్యూఏసీ డైరెక్టర్‌తో ఆరా: ఇంటర్నల్ క్వాలిటీ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ సెల్ (అంతర్గత నాణ్యత ప్రమాణాల మదింపు విభాగం) డైరెక్టర్ ఆచార్య జి.శ్రీధర్‌తో విభాగాల పురోగతిపై ఆరా తీశారు.
విభాగాల వారీగా పరిశీలన : కెమిస్ట్రీ విభాగంలో న్యాక్ పీర్ కమిటీ సభ్యులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఆచార్య ఎన్ ఎస్ షెకావత్, ఆచార్య మహేంద్ర డి .శ్రీసత్ (న్యాక్ పీర్ కమిటీ సభ్యులు)లను కెమిస్ట్రీ విభాగాధిపతి ఆచార్య జే.శ్రీరాములు విద్యార్థులను పరిచయం చేశారు. ఆచార్య జే. శ్రీరాములు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
► రూరల్ డెవలప్‌మెంట్ అండ్ సోషల్ వర్క్, సోషియాలజీ, మేనేజ్‌మెంట్ విభాగాధిపతులు ఈ క్లాస్‌రూంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. రూరల్‌డెవలప్‌మెంట్, సోషియాలజీ రెండు విభాగాలు ఒకే సారి కలిపి ఇవ్వడంతో న్యాక్ పీర్ కమిటీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. టీచింగ్ పర్సనల్‌లకు ఇచ్చే జీతం ఎందుకు తక్కువగా ఉందని ప్రశ్నించారు. ఇందులో న్యాక్ పీర్ కమిటీ సభ్యులు ఆచార్య బీకే పునియా, ఆచార్య కన్హియ అహుజా పాల్గొన్నారు.
► న్యాక్ పీర్ కమిటీ చైర్మన్ ఆచార్య ఎస్వీ సింగ్, ఆచార్య సౌందర్యపాండన్, ఆచార్య ఎన్ . గోవిందరాజులు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ విభాగాల ఆచార్యులతో సమాచారాన్ని ఆరా తీశారు. పీర్ కమిటî చైర్మన్ అడిగిన ప్రశ్నలకు తెలుగు విభాగం ఆచార్యులు ఇచ్చిన సమాధానాల్లో స్పష్టత కరువైందన్నారు. తమిళంలో పీహెచ్‌డీ చేసే ప్రొఫెసెర్లు తెలుగులో ఎలా పీహెచ్‌డీ ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇంగ్లిష్ విభాగానికి సంబంధించి డాక్టర్ వి. మాధవితో మాట్లాడారు.
►కెమిస్ట్రీ, బయెటెక్నాలజీ, బోటనీ, ఇంగ్లిష్, జువాలజీ విభాగాధిపతులు, ఇన్‌చార్జ్ విభాగాధిపతులు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ల పట్ల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం ట్వంటీ క్రికెట్ మ్యాచ్‌లను పరిశీలించి, సాయంత్రం 5 గంటలకు ఈ క్లాస్ రూంలో పూర్వ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో న్యాక్ కమిటీ ఒక టీం సభ్యులు మాట్లాడారు. మరో టీం అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలల ప్రిన్సిపల్స్‌తో సమావేశమై కర్రికులం, పరీక్షల నిర్వహణ విధానాలు, వర్సిటీ అవలంబిస్తున్న పద్ధతులపై పాలిమర్ సైన్సెస్ సెమినార్ హాల్‌లో ఆరా తీశారు. విద్యార్థులతో మూడో టీం పూలే భవనంలో సమావేశమయ్యారు. రాత్రి 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.