సాక్షి, కడప: కన్న వారిని.. ఉన్న ఊరిని మరిచిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సాయం చేసిన వారిని గుర్తుంచుకుంటారని అనుకోవడం అత్యాశే అవుతుంది. కడప నగరంలో ఎకరా రూ.1 వెయ్యి చొప్పున 11 ఎకరాలు కేటాయించడంతో పాటు, సొంత నిధులను రూ.50 లక్షలు వెచ్చించి వైఎస్‌ఆర్‌ఆర్–ఏసీఏ మైదానం ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన దివంగత సీఎం వైఎస్సార్ జయంతిని నిర్వహించడానికి జిల్లా క్రికెట్ సంఘం పెద్దలకు మనసు రాకపోగా.. ఏసీఏ మాజీ కార్యదర్శి గోకరాజు గంగరాజు పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్‌లు కట్ చేసి వేడుకలు నిర్వహించడం క్రికెట్ సంఘంలో కొనసాగుతున్న విపరీత పోకడలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహానేత, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కడప నగరంలో ఉన్నత ప్రమాణాలతో స్టేడియం నిర్మించాలని సంకల్పించారు. దీంతో ఆంధ్రా క్రికెట్ సంఘం పెద్దలతో సంప్రదించడంతో పాటు ఎంతో విలువైన భూములను ఎకరా కేవలం రూ. వెయ్యి చొప్పున 11.62 ఎకరాలను ఏసీఏ వారికి అప్పజెప్పారు. దీంతో పాటు ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి జ్ఞాపకార్థం రూ.50 లక్షల సొంత నిధులను ఏసీఏకి అందించారు. వైఎస్‌ఆర్ మరణానంతరం 2011లో కడప నగరంలో క్రికెట్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. ఈ మైదానానికి వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ మైదానం అని నామకరణం చేశారు. ఇంత వరకు బాగానే ఉంది.
మహానేత గుర్తులు మాయం..
అయితే ఇంతసాయం చేసిన మహానేత చిత్రపటం కానీ, విగ్రహం ఏర్పాటు చేసేందుకు క్రికెట్ సంఘం పెద్దలకు మనసురాలేదు. దీనికి తోడు ఎక్కడా కూడా వైఎస్ రాజారెడ్డి స్టేడియం అన్న విషయం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయమై జూన్ నెల 21న ‘దాతలను విస్మరించడం తగునా’ అంటూ సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు మొక్కుబడిగా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. త్వరలోనే విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు తప్పితే ఆచరణలోకి మాత్రం ఇంకా రాలేదు.
కనీసం వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేయడానికి క్రికెట్ సంఘం పెద్దలకు మనసు రాకపోవడం విచారకం. అయితే మాజీ కార్యదర్శి గోకరాజు గంగరాజుకు సంబంధించి చిత్రపటాలు మాత్రం ఏసీఏ కార్యాలయాల్లో నేటికీ దర్శనమిస్తుండటం గమనార్హం. ఈయన చిత్రపటం ఉండటం ఆక్షేపణీయం కానప్పటికీ దాతల చిత్రపటాలను కూడా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అభిమానుల్లో నెలకొంది.
ఘనంగా గోకరాజు జన్మదిన వేడుకలు.
.స్టేడియం అభివృద్ధికి పాటుపడిన వారిని విస్మరించి తమకిష్టమైన వారి భజనలో మునిగితేలుతున్నారు. కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ఆర్–ఏసీఏ స్టేడియంలోని స్కూల్ ఆఫ్ అకాడమీలో గోకరాజు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. ఏసీఏ సౌత్‌జోన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి రామ్మూర్తి ఆధ్వర్యంలో ఏసీఏ మాజీ కార్యదర్శి గోకరాజు గంగరాజు 76వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రికెటర్ల చేతుల మీదుగా కేక్ కట్ చేసి, మైదానం ఆవరణలో మొక్కలు నాటడం గమనార్హం.
గోకరాజు గంగరాజు అందించిన సేవలపై జిల్లా క్రికెట్ సంఘం పెద్దలకు అభిమానం ఉంటే ఆయన వేడుకలను నిర్వహించుకోవడం అభ్యంతరం లేనప్పటికీ, ఇటీవల వైఎస్సార్ జయంతి సందర్భంగా కనీసం ఆయనను స్మరించుకున్న దాఖలాలు లేకపోవడం మహానేత అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. జిల్లాకు చెందిన వ్యక్తి, మైదానం ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన మహానేతను స్మరించుకునేందుకు మనసు రాలేదా అని క్రికెట్ సంఘంలోని మరోవర్గం ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా క్రికెట్ సంఘం పెద్దలు వివక్షతను విడనాడి దాతల విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment