సీమాంధ్ర మంత్రులు ద్రోహులు
Published Sun, Feb 9 2014 3:27 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సీమాంధ్ర కేంద్రమంత్రులు తెలుగుజాతి ద్రోహులని విశాలాంధ్ర మహసభ జిల్లా అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర మంత్రుల తీరును వ్యతిరేకిస్తూ శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట వినూత్న రీతిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడి మాట్లాడుతూ, సీమాంధ్ర కేంద్రమంత్రుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బస్సు, రైల్వే స్టేషన్‌లో ఉండే దొంగలకన్నా వీరు ప్రమాదమని, ఈ విషయంలో ప్రజలను చైతన్యపరచడానికే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాలకు వస్తే తరమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ జిల్లా కో కన్వీనర్ మద్దిల సోంబాబు, విద్యార్థి సంఘం నాయకులు శ్యామ్, భరత్, పతంజలి, వికలాంగుల సంఘం నాయకులు శ్రీను, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీలు డ్రామాలాడుతున్నారు
విజయనగరం ఆరోగ్యం : సీమాంధ్రకు చెందిన ఎంపీలు రాష్ట్ర విభజన విషయంలో డ్రామాలాడుతున్నారని వైద్య, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.ఇజ్రాయిల్ అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక కేంద్రాస్పత్రి అత్యవసర విభాగం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటలీ లేడీ.. సోనియా కిలాడీ.. సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్ మాట్లాడుతూ, తెలంగాణ బిల్లును అడ్డుకోవాల్సిన ఎంపీలు ప్యాకేజీల గురించి మాట్లాడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విభజనకు సహకరిస్తే సీమాంధ్ర ద్రోహులుగా గుర్తించి విగ్రహాలు కడతామని చెప్పారు. ఇప్పటికైనా కపట నాటకాలు మాని చిత్తశుద్ధిదతో సమైక్యాంధ్ర పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. వైద్య ఉద్యోగుల ధర్నాకు ఏపీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు ప్రభూజీ, పెద్దింటి అప్పారావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఆచారి, బాలాజీ పాణిగ్రాహి, ఉమాపతి, చిన్నంనాయుడు, రామయ్యమ్మ, ధనలక్ష్మి, పద్మజ, సత్యనారాయణ, రమణ, త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు.
చివరి వరకూ పోరాటం
బెలగాం : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం చివరి వరకూ పోరాడుతామని ఏపీ ఎన్‌జీఓ పార్వతీపురం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు గంజి లక్ష్మున్నాయుడు, జీవీఆర్‌ఎస్ కిశోర్ అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏపీఎన్‌జీఓలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అంతకుముందు కాంప్లెక్స్ నుంచి పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించారు. తెలుగుతల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద లక్ష్మున్నాయుడు, కిశోర్ మాట్లాడుతూ, ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా 10న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, 12న వ్యాపార సంస్థల బంద్, జాతీయ రహదారుల దిగ్బంధం, తదతర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్థానిక కోర్టు జంక్షన్ వద్ద బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు దీక్షలు చేపట్టారు.
ఆందోళన కొనసాగిస్తాం
విజయనగరం కలెక్టరేట్ : రాష్ట్ర విభజన బిల్లు ఉపసంహరించుకునేంత వరకూ ఆందోళన కొనసాగిస్తామని సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ గంటా వెంకటరావు, ఏపీ ఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు ప్రభూజీ స్పష్టం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్‌జీఓలు చేపడుతున్న ఆందోళన మూడు రోజుకు చేరుకుంది. సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ వెలవెలబోయాయి. కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన దీక్షలో వెంకటరావు, ప్రభూజీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మొండిగా విభజన వైపు అడుగులు వేయటం మంచి పద్ధతి కాదన్నారు. తక్షణమే సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు స్పందించి విభజనను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలు పట్టించుకోకపోతే పుట్టగతులుండవన్నారు. రోజురోజుకూ ఉద్యమం తీవ్రమవుతున్నా పాలకులు పట్టించుకోకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నుంచి ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. పదో తేదీన చేపట్టనున్న జిల్లా బంద్‌కు సహకరించాని కోరారు.
నేడు సమైక్య పరుగు..
సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్య రాష్ట్రపరిరక్షణ సమితి, ఒలింపిక్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం సమైక్యపరుగు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి యువత తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌జీఓ అసోషియేషన్ నాయకులు డీవీ రమణ, ఆర్‌ఎస్ జాన్, పింఛనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దింటి అప్పారావు, ఎన్‌జీఓ నాయకులు కొట్నాన.శ్రీనివాసరావు, రత్నం, రమణమూర్తి, కనికరం బాబు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement