సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈనెల 30న జరగనున్న ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి జగన్‌కు వీరు వివరించినట్టు సమాచారం.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ మహేశ్ చంద్రలడ్డా కూడా జగన్‌ను కలిసి అభినందనలు చెప్పారు. మరోవైపు ఆయా శాఖల్లో ప్రస్తుత పరిస్థితులు, సుపరిపాలనకు చేపట్టాల్సిన మార్పులపై కసరత్తును వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈరోజు సాయంత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమలకు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఆయన తిరుమలకు వెళ్తారు. రాత్రి ఏడు గంటలకు తిరుమలకు చేరుకుని అక్కడే బస చేసి 29 ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. కడపలో పెద్ద దర్గాను దర్శిస్తారు. తర్వాత పులివెందులకు వెళ్లి సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రి, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు. తర్వాత కడప చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment