‘మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు’ | Stage Set As AP Ministers Swearing | Sakshi
Sakshi News home page

‘మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు’

Published Thu, Jun 6 2019 8:13 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

Stage Set As AP Ministers Swearing - Sakshi

సాక్షి, అమరావతి : ఈనెల 8న అమరావతి సచివాలయ ప్రాంగణంలో జరగనున్న ఆంధ్ర్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాటు జరుగుతున్నాయి. శనివారం ఉదయం  11.49 గంటలకు మంత్రులు పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇందుకు సంబంధించి సీఎస్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమం సజావుగా జరిగేలా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈవేడుకకు విచ్చేసే అత్యంత ప్రముఖులు, ప్రముఖులు, ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వారి కుటుంబ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్సీ తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజలకు కేటాయించిన ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా ఆయా మార్గాల గుండా సైనేజి బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పదవీ స్వీకార ప్రమాణ ప్రాంగణానికి చేరుకునే రహదారుల్లో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎస్‌  ఆదేశించారు. ప్రమాణ స్వీకారోత్సవంపై ప్రచురించిన ఆహ్వాన పత్రికలకు వెనుకవైపున తెలుగులో రూట్ మ్యాప్ ను ముద్రించాలని  తద్వారా ఆహ్వానితులు తదితరులు సులభంగా వేడుక ప్రాంగనానికి  చేరుకునేందుకు వీలుంటుందని సీఎస్‌ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

ఈ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసే అతిధులు, మీడియాతో సహా ప్రతి ఒక్కరికీ వారు కూర్చున్న ప్రాంతంలోనే  తాగునీరు, అల్పాహారం వంటివి అందించాలని, ఈఏర్పాట్ల విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. బందోబస్తు ఏర్పాటు, తాగునీరు, అల్పాహారం వంటివి అందించడంలో ఎంతమాత్రం  రాజీపడవద్దని అదే సమయంలో అనవసర ఖర్చులకు తావీయకుండా అవసరమైన మేరకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధింత  శాఖల అధికారులకు సీఎస్‌ స్పష్టం చేశారు. ఈవేడుకలకు విచ్చేసిన వారు పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సక్రమంగా  తిలకించేందుకు వీలుగా ప్రాగణంలో సరిపడిన మేరకు ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రివర్గ ప్రమాణ  స్వీకార కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున సందర్శకులు సచివాలయం సందర్శనకు వస్తారని కావున సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో  మరుగుదొడ్లు తదితర అన్నీపరిశుభ్రమంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇంకా మంత్రివర్గ  ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఆయా శాఖలపరంగా  తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని సీఎస్‌ ఆదేశించారు.

పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేలా విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు  తెలిపారు. ఆహ్వాన పత్రికల వెనుకవైపు ప్రమాణ స్వీకారోత్సవ  ప్రాంగణానికి ఏవిధంగా చేరుకోవాలనే దానిపై రూట్ మ్యాప్  ముద్రిస్తే అతిధులు తదితరులు సులభంగా ప్రాంగణాన్ని చేరుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. మంత్రివర్గ ప్రమాణ  స్వీకార కార్యక్రమం ఒక క్రమపద్ధతిలో సజావుగా జరిగేందుకు  వీలుగా పోలీస్ శాఖ తరుపున తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు.  రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ 8వ తేదీ ఉ.11.49 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమానికి సుమారు 5 వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. 8వ తేదీ ఉదయం11.44 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌ మోహన్ రెడ్డి, 11.45 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ వేడుక ప్రాంగణానికి చేరుకుంటారని ఆయన తెలిపారు. ఈకార్యక్రమానికి సంబంధించి అవసరమైన వివిధ రకాల పాస్ లను ముద్రించి పంపిణీ  చేస్తున్నట్టు చెప్పారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం అతిధులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు తదితరులకు తేనీటి విందు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement