ఏడాదంతా అన్నదాతను వెంటాడుతున్న తుపానులు
ప్రకృతి ప్రకోపంతో తల్లడిల్లుతున్న రైతన్నలు
ఆదుకుంటామని..ఆపై మొఖం చాటేస్తున్న నేతలు
కొండంత నష్టానికి గోరంత అంచనాలు
పరిహారం కోసం పడిగాపులు కాస్తున్న రైతులు
ఖమ్మం, న్యూస్‌లైన్: ఈ ఏడాది ప్రకృతి రైతన్నను పగబట్టినట్టుంది. ఒక తుపాను పోయాక మరో తుపాను వెంటాడుతుంటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఎడతెగని వానలతో రెండు, మూడుసార్లు నాటుపెట్టిన పంటచేలు దెబ్బతినడంతో రూ.వేలు, లక్షల పెట్టుబడులు ఆ వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. పట్టువదలని విక్రమార్కుడిలా రైతు మళ్లీ పంటను నాటేస్తే...మరోసారి ప్రకృతి ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే పై-లీన్, హెలెన్ రూపంలో రెండు విపత్తులు పంటలను పనికిరాకుండా చేయగా లెహర్ రూపంలో మరో గండం పొంచివుందని తెలుస్తుండటంతో రైతు కిన్నుడవుతున్నాడు. దెబ్బతిన్న పంటలకు ఏమాత్రం నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వం...కనీసం అంచనాలను కూడా సరిగా లెక్కించని అధికారయంత్రాంగం...కొండంత నష్టాన్ని గోరంతగా చూపుతున్న వైనాన్ని చూసి కుమిలిపోతున్నాడు. లక్షల్లో నష్టం వస్తే కనీసం వేలల్లో కూడా పరిహారం ఇచ్చే పరిస్థితి లేదని అన్నదాత ఆవేదన చెందుతున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొత్తం తుపాను బీభత్సమే చోటుచేసుకోవడంతో సాగుదారుల పరిస్థితి సంకటంగా మారింది.
జూలెనైలలో వచ్చిన గోదావరి వరదలతో పరీవాహక ప్రాంతాలైన వీఆర్‌పురం, కూనవరం, కుక్కునూరు, భద్రాచలం, చర్ల, చింతూరు, వాజేడు, వెంకటాపురం మండలాలతోపాటు మణుగూరు ప్రాంతాల్లో అప్పుడే వేసిన వరి నార్లు, పాటు చేసిన పత్తి, నారుమళ్లు, మిర్చి నారు, కూరగాయలు నీట మునిగాయి. సుమారు లక్ష ఎకరాలకు పైగా పత్తి, వరి, అపరాల పంటలు నాటు వేసే దశలోనే కొట్టుకుపోయాయి. వరదగోదారిలో పంటలు మునగడంలో గుండె చెదిరిన వేలేరుపాడు మండలం పచ్చిమకోటకు చెందిన రైతు ఈడ్పుగంటి నర్సయ్య(55), కుక్కునూరు మండలం ఎల్లప్పగూడెం గ్రామానికి చెందిన రైతు ఆప్కా పెంటయ్య(48) గుండె ఆగి మృతి చెందారు. కుక్కునూరు మండలం రామసింగారం గ్రామానికి చెందిన పసుపులేటి వెంకటేశ్వరరావు కుళ్లిన పత్తి పంటను చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 15న జూలూరుపాడు మండలంలోని సాయిరాం తండాకు చెందిన గిరిజన రైతు దంపతులు భూక్యా దీప్లా(38), పద్మ(35) పిడుగుపాటుతో మృతి చెందారు. కొత్తగూడెం రూరల్ మండలం రేగళ్ల పంచాయతీ పరిధిలో పెద్దతండాకు చెందిన ధరావత్ లింగీ (35), టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన మోకాళ్ల భద్రయ్య (38)లు పిడుగు పాటుతో మృతి చెందారు. వర్షం ఓవైపు పంటనష్టాలు చేస్తూ... మరోవైపు పిడుగుపాటుతో ప్రాణాలు బలిగొంది. అధికారులు 22,500 ఎకరాల పత్తి, 12,500 ఎకరాల్లో వరి, ఐదువేల ఎకరాల్లో అపరాలు, మొత్తం 40వేల ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయని, వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసిందని లెక్కలు వేశారు. నిజానికి జిల్లాలో మొత్తం రూ.150 కోట్లకు పైగా నష్టం వాటిల్లినా ఇప్పటి వరకు చిల్లిగవ్వకూడా రైతులకు పరిహారంగా ఇవ్వలేదు. ఒక్కరిద్దరు రైతులకు 50 శాతం సబ్సిడీలపై విత్తనాలు సరఫరా చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకు పంటనష్టం పరిహారం ఊసే ఎత్తలేదు.
ఆక్టోబర్ 21వ తేదీ నుంచి వారం రోజులుపాటు ఎడతెరపి లేకుండా జిల్లాలో కురిసిన వర్షాలకు తొలిసారి తీసే దశలో ఉన్న 2, 54,570 ఎకరాల పత్తి, 27,600 ఎకరాల్లో కోతకొచ్చిన వరి, 21,775 ఎకరాల్లో మొక్కజొన్న, 15,200 ఎకరాల మిర్చితోటలతోపాటు 18,061 ఎకరాల్లో పొగాకు, వేరుశనగ, కూరగాయల పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంటలు నీట మునగడంతో గుండె చెరువైన రైతులు కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన గద్దికొప్పుల రామయ్య(40), కొత్తగూడెం మండలం బేతంపూడికి చెందిన తేజావత్ రాజు సొమ్మసిల్లి పడిపోయాడు. పెనుబల్లి మండలం బయన్నగూడెం గ్రామానికి చెందిన బొప్పిశెట్టి చెన్నారావు గుండెపోటుతో మరణించాడు. వర్షాలకు పంటలు దెబ్బతిన్న సమయంలో అధికారులు, కేంద్రమంత్రి బలరాంనాయక్, రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కానీ వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు మాత్రం నిబంధనల పేరుతో కేవలం 76వేల ఎకరాల పత్తి, మూడు వేల ఎకరాల వరి, వెయ్యి ఎకరాల్లో వేరుశనగ, ఇతర పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాలు వేశారు. శాస్త్రీయపద్ధతిలో అంచనాలు వేయాలనే పేరుతో ఈ అంచనాలను కూడా మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పై-లీన్, హెలెన్ తుపానులతో జిల్లాలోని మధిర నియోజకవర్గంలో ఐదు వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. మరో తుపాను పొంచివుందని వాతావరణశాఖ చెబుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పరిహారం ఎప్పుడు అందేనో...
గోదావరి వరదలు, భారీ వర్షాలతో పంటలను కోల్పోయిన రైతులకు పరిహారం ఇస్తామని ప్రకటించిన అధికారులు, నాయకులు కనిపించకుండా పోయారు. గత సంవత్సరం కురిసిన నీలం తుపానుతో జిల్లా వ్యాప్తంగా 3.18 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. దీని విలువ రూ. 171 కోట్ల మేరకు ఉంటుందని రైతు సంఘాల నాయకులు, అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పుడు జిల్లాలో పర్యటించారు. పంటనష్టం జరిగిన ప్రాంతాల్లో రైతులు కన్నీళ్లు పెట్టడాన్ని చూశారు. కేంద్ర బృందం వస్తుంది పంటనష్టాన్ని అంచనా వేస్తుందని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 21వేల మంది రైతులకు కేవలం రూ. 10.5 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదిక పంపించారు. దీనిపై కూడా ఆంక్షలు విధించి ప్రభుత్వం కోతపెట్టి కేవలం రూ. 6.5 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇందులో రూ. 4.5 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అప్పుడే ఇలా ఉంటే...ప్రస్తుత పరిస్థితుల్లో పరిహారం ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో, రాదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంట నష్టపోయినా పైసా పరిహారం ఇవ్వలేదు:
గత నెలలో కురిసిన పై-లీన్ తుపానుకు ఐదు ఎకరాల్లో పత్తి పంట నాశనమైంది. ఎకరానికి మూడు క్వింటాళ్ల పత్తి పనికిరాకుండా పోయింది. పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేలా లేవు. ప్రభుత్వం ఇంత వరకు పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. ఇకమీదట ఇస్తుందన్న నమ్మకం కూడా లేదు.
రాయల వెంకటేశ్వర్లు, కొత్తలింగాల, కారేపల్లి మండలం
పంటచేలపై ‘కారుమబ్బులు’
Published Tue, Nov 26 2013 5:47 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement