* రుణ మాఫీపై పూటకో మాట చెప్తూ ప్రభుత్వం అదను దాటించేసిందని రైతాంగం ఆవేదన
* మరో రెండు మూడు మాసాల్లో రుణ మాఫీ చేస్తామంటున్నారు.. ఇప్పుడు అప్పులు పుట్టడం లేదు..ఈలోగా సీజన్ దాటిపోతుంది
* మీరే రుణాలు చెల్లించుకోండి అని రైతులకు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి సలహా ఇస్తున్నారు
* మాకు స్తోమత లేదనేగా మీరు రుణ మాఫీ వాగ్దానం చేసింది.. ఆ వాగ్దానాన్ని నమ్మే కదా మేం ఓట్లేసింది.. ఇప్పుడిలా మాటమార్చడమేమిటని ప్రశ్నిస్తున్న రైతులు
* ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నందుకు వడ్డీ భారం మీద పడింది
* ఆ వడ్డీ ఎవరు కడతారో కూడా స్పష్టత లేదంటూ రైతన్నల ఆవేదన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఖరీఫ్ సీజన్ కష్టాలు తప్పలేదు. అప్పుల బాధ తీరుతుందని గంపెడాశతో ఎదురుచూసిన రైతులకు ఈ సీజన్‌లో అసలు అప్పులే లేని పరిస్థితుల్లోకి నె ట్టేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు రైతులకు రుణాలు లభించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వాటి కష్టాలను ప్రత్యక్షంగా చూశానని.. తాను అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కమిటీలు, రీషెడ్యూలు అంటూ కాలయాపన చేయడంతో రైతులకు అసలు రుణాలే దక్కని పరిస్థితి ఏర్పడింది. పాత అప్పులు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి చెప్పడంతో రైతులు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.
‘రుణాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామనే కదా చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చింది... ఆయన మాటలు నమ్మే కదా మేము ఓటేసింది. తీరా.. ఏరు దాటాక ఇదేం పద్ధత’ంటూ రైతన్నలు వాపోతున్నారు. మరోవైపు బ్యాంకులు సైతం పాతవి కట్టనిదే కొత్త రుణాలు ఇవ్వబోమని తేల్చిచెప్తున్నాయి. ఆలస్యంగానైనా వర్షాలు కురుస్తుంటే సాగు కోసం అవసరమైన పెట్టుబడికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూలైలో మొదలయ్యే ఖరీఫ్ కొంత ఆలస్యమైనప్పటికీ చివరగా ఈ నెల 15 లోపు పంటలు వేయకపోతే ఇక ఈ సీజన్‌పై రైతులు ఆశలు వ దులుకోవలసిందేనని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనాల కారణంగా వర్షాలు కురిసినప్పటికీ రుణాలు లేక పంట వేయలేని నిస్సహాయ స్థితిలో రైతులున్నారు.
బ్యాంకులకు సమాధానం ఎవరు చెప్పాలి?
రుణ మాఫీ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న ప్రభుత్వం వాటిపై ఇప్పట్లో ఎటూ తేల్చే పరిస్థితి కనిపించడం లేదు. రుణాల రీషెడ్యూలు విషయంలో కూడా రిజర్వు బ్యాంకు అడిగిన వివరాలు అందించడంలో మీనమేషాలు లెక్కిస్తున్న కారణంగా రీషెడ్యూలు కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ సీజన్‌లో రుణాల రీషెడ్యూలు అయ్యే అవకాశాలే లేవని బ్యాంకర్లు ఇప్పటికే ప్రకటించారు. పైగా ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చకుండా కొత్త రుణాలు ఇవ్వలేమని కూడా బ్యాంకర్లు చాలా స్పష్టంగా చెప్పారు.
మొత్తంమీద ఈ దోబూచులాట మధ్య రైతులకు కొత్త రుణాలు లేకపోగా వారి నెత్తిన అదనంగా 13 శాతం వడ్డీ భారం పడింది. అంటే లక్ష రూపాయలు అప్పు తీసుకున్న రైతుకు గడచిన ఏడాదికే 13,000 రూపాయల వడ్డీ పడింది. ఈ సంవత్సరానికి మళ్లీ అంతే వడ్డీ చెల్లించాలి. చంద్రబాబు మాటలు నమ్మి సకాలంలో అప్పు చెల్లించని పాపానికి వడ్డీ రూపంలో మా నడ్డి విరిగిందని రైతులు వాపోతున్నారు. రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు వాటిని చెల్లించాలని చెప్తుంటే.. అదనపు వడ్డీ కట్టాల్సిందేనంటున్న బ్యాంకులకు సమాధానం ఎవరు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
రుణాలపై దిక్కుతోచని స్థితిలో రైతాంగం...
ఇదిలావుంటే.. కృష్ణా వాటర్ బోర్డు సమావేశంలో నిర్ణయించిన మేరకు డెల్టా నారుమళ్లకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించి ఆ మేరకు నీటి విడుదల ప్రక్రియ ప్రారంభం కాగా 13 లక్షల ఎకరాల్లో సాగుకు పరిస్థితి సానుకూలమైంది. ఈ పరిస్థితుల్లో రైతాంగానికి పెట్టుబడి చాలా కీలకంగా మారింది. ఈ అదను తప్పిన తరువాత రుణాలిస్తామన్నా ప్రయోజనం ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 87,617 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు, 14,208 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కావస్తున్నా ఆ హామీలపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పైగా ఇప్పుడు సీజన్ దాటిపోయే పరిస్థితుల్లో చివరి అంకంలో కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా కల్పించకపోవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది.
ఆర్‌బీఐ పైకి నెపం నెడుతూ సర్కారు కాలక్షేపం...
పైగా రుణాల రీషెడ్యూలు కూడా కనీసంగా మరో రెండు నెలలు పడుతుందని ప్రభుత్వం తాజాగా చెప్పడంతో ఇక ఈ సీజన్‌లో రైతులకు బ్యాంకుల నుంచి అప్పులు పుట్టవని తేలిపోయింది. వనరుల సమీకరణ కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ మరో రెండు నెలల వరకు నివేదిక ఇచ్చే పరిస్థితులు లేవని అధికారవర్గాలు చెప్తున్నాయి.
ఇప్పటికే నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో వేసిన కమిటీ కోసం నెలన్నర గడువు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు వనరుల సమీకరణ కోసం వేసిన కమిటీ నివేదిక కోసం, మరోవైపు రీషెడ్యూలు కోసం ఆర్‌బీఐపై నెపం నెడుతూ కాలయాపన చేస్తుండటాన్ని బట్టి ఈసారి ఏపీ రైతులకు బ్యాంకుల నుంచి కొత్త అప్పులు ఉండవని పరోక్షంగా తేల్చిచెప్పినట్టేనని అధికారులు చెప్తున్నారు.
ఇది వంచన కాదా?
Published Wed, Aug 6 2014 12:33 AM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM
Advertisement