ఆత్మరక్షణలో తమ్ముళ్లు
* కేంద్ర బడ్జెట్‌లలో రాష్ట్రానికి అన్యాయం
* ప్రశ్నించలేని స్థితిలో టీడీపీ అధినేత
* ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్న నేతలు, కార్యకర్తలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : కేంద్ర ప్రభుత్వం తీరుతో టీడీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి రిక్తహస్తం చూపించడంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీతో టీడీపీ మిత్రపక్షంగా మెలుగుతున్నా అదనపు ప్రయోజనాలు సాధించలేకపోతోంది. గుంపులో గోవిందా అన్న రీతిగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఆంధ్రప్రదేశ్‌ను చూస్తుండటంతో టీడీపీ నేతలు ఖంగుతింటున్నారు.
మరోవైపున ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఎం.వెంకయ్యనాయుడును సమయం దొరికిన ప్రతీసారీ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అనేక రకాలుగా సహకారం అందిస్తోందని, వెంకయ్య నాయుడు సిఫార్సులతో రాష్ట్రానికి అనేక కొత్త ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వస్తున్నాయంటున్నారు. అవి కార్యరూపం దాల్చకపోవడం, సమయం వచ్చిన ప్రతీసారీ ఝలక్ ఇస్తుండడంతో టీడీపీ నేతలు నిశ్చేష్టులవుతున్నారు.
పెరుగుతున్న అసహనం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన, విశాఖ రైల్వేజోన్, కేంద్ర బడ్జెట్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి సహాయం చేయకపోవడంతో టీడీపీ నేతల్లో అసహనం పెరుగుతోంది. అయితే అధినేత చంద్రబాబు మిత్రపక్షమైన బీజేపీపై ఘాటుగా విమర్శిస్తే అసలుకే మోసం వస్తుందనే భావనతో రాష్ర్ట ‘ప్రయోజనాలు’ను పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వైఖరి, స్థానిక బీజేపీ నాయకుల వైఖరితో విసుగెత్తిన టీడీపీ నేతలకు అధినేత వైఖరి మింగుడు పడడం లేదు.
ప్రాజెక్టుల నిర్మాణంపై సందేహాలు
రాజధాని నిర్మాణానికి ఎటువంటి నిధులు కేటాయించకపోవడం, రాష్ట్రంలోని జాతీయ ప్రాజెక్టులకు నిధులు పరిమితంగా కేటాయించడంతో వాటి నిర్మాణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నారుు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాల అభివృద్ధి ముడిపడి ఉంది. రూ.30 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు కేంద్రం బడ్జెట్‌లో రూ.100 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని రాష్ట్రం చెబుతున్నప్పటికీ, పరిమిత కేటాయింపుల వలన ఏం సాధించలేని దుస్థితి రాష్ట్రానికి ఏర్పడుతోంది.
రానున్న ఆర్థిక సంవత్సరానికి కనీసం రూ.5 వేల కోట్లు ఈ బడ్జెట్‌లో కేంద్రం కేటాయించనుందని ఆ పనులు పొందిన నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టులు చేస్తున్న సంస్థలపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయిస్తోంది. ఇప్పటి వరకు చేసిన పనులకు ఆ సంస్థలకు కనీసం రూ.300 కోట్లకుపైగా నగదు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ కేటాయింపులు చూసి ప్రస్తుతం పనులు చేస్తున్న నిర్మాణ సంస్థలు వాటిని నిలుపుదల చేసే ఆలోచనలో ఉన్నాయి.
రాష్ట్ర అభివృద్ధిపై అనుమానాలు
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిమ్స్ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ)కు మంగళగిరిలో శంకుస్థాపన జరిగిన సమయంలో కేంద్రంలో నిధులు కేటాయిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కళాశాలను ప్రారంభిస్తామన్నారు. నిర్మాణ పనులన్నింటినీ మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. అయితే ఈ సంస్థకు నిధుల కేటాయింపు లేకపోవడంతో రాష్ట్ర అభివృద్ధిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విమర్శల వెల్లువ
కేంద్రంలోని బీజేపీతో మిత్ర పక్షంగా కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోని బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేయకుండా మిన్నకుండిపోవడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఓటుకు నోటు కేసు కారణంగా కేంద్రంపై ఎటువంటి విమర్శలు చేయలేక రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత బడ్జెట్‌పై స్పందించిన తీరు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా మెతకవైఖరితో కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనే భయం మిగిలిన నేతలను వెంటాడుతోంది. దీనిపై అంతర్గతంగా చర్చ సాగుతోంది.