అడ్మిషన్లు సరే.. అధ్యాపకులేరి? | Andhra Pradesh Govt Neglecting Fulfill Medical College Vacancy Jobs | Sakshi
Sakshi News home page

అడ్మిషన్లు సరే.. అధ్యాపకులేరి?

Published Thu, Jun 28 2018 7:44 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

Andhra Pradesh Govt Neglecting Fulfill Medical College Vacancy Jobs - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి : ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో వైద్య విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మున్ముందు వైద్య విద్యార్థులకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఉన్న 1900 సీట్లకు యాబైవేల మందిపైనే పోటీపడి ప్రతిభ ఆధారంగా ప్రభుత్వ కళాశాలల్లో సీటు తెచ్చుకుంటారు. అయితే ఆ ఆనందం కోర్సులో చేరిన కొద్ది రోజులకే ఆవిరైపోతోంది. 

అందరికీ అదే సమస్య: వైద్య కళాశాలల్లో నాలుగేళ్లుగా నియామకాల్లేవు. 11 ప్రభుత్వ బోధనా కళాశాలల్లో దారుణమైన పరిస్థితులున్నాయి. మరికొద్ది రోజుల్లో 1900 మంది అభ్యర్థులు వైద్య విద్యలో ప్రవేశాలు పొందుతారు. గడిచిన నాలుగు బ్యాచ్‌లకు చెందిన సుమారు 7,500 మంది మెడికోలు ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదువుతున్నారు. ఏడాదికి 1400 మంది లెక్కన మూడేళ్లకు కలిపి సుమారు 4,200 మంది పీజీ వైద్య విద్యార్థులు చదువుకుంటున్నారు. వీళ్లందరికీ ఇప్పుడు ఒక్కటే ఇబ్బంది.. అధ్యాపకులు సరిపడా లేకపోవడం. సబ్జెక్టుల వారీగా అధ్యాపకుల్లేక మెడికోలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. అడ్మిషన్ల వేళ.. అధ్యాపకులు లేరన్న వాస్తవం విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. 

ముఖ్యమైన సబ్జెక్టులకూ లేరే: ఎంబీబీఎస్‌లో చేరిన వారికి అనాటమీ ప్రధానమైన సబ్జెక్టు. అలాంటి కీలక సబ్జెక్టుకే సరిపడా అధ్యాపకుల్లేరు. పీజీ వైద్య విద్యార్థులూ అధ్యాపకుల లేమితో ఇబ్బందిపడుతున్నారు. న్యూరో సర్జరీలోనూ 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో 11 ప్రొఫెసర్, 10 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆఫ్తాల్మాలజీలో 13 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓ వైపు బయట వేలాది మంది పీజీ చేసిన వైద్యులు కూడా నిరుద్యోగులుగా ఉన్నా నియామకాలకు ప్రభుత్వం మొగ్గు చూపట్లేదు. భారతీయ వైద్య మండలి తనిఖీలకు వచ్చినప్పుడు ఇతర కళాశాలల నుంచి అధ్యాపకులను చూపించి అప్పటికప్పుడు గండం నుంచి గట్టెక్కడం జరుగుతోంది. ఉన్న సీట్లను కాపాడుకోవడం ఏటా గండంగా మారింది.  కొత్త సీట్లు రాకపోవడానికీ సిబ్బంది లేమే కారణమని అధ్యాపకులు చెబుతున్నారు. 

ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఖాళీలు ఇలా

కేటగిరీ                      మంజూరైన పోస్టులు    రెగ్యులర్‌    కాంట్రాక్టు    ఖాళీలు
ప్రొఫెసర్లు                    507                    357            09         150
అసోసియేట్‌ ప్రొఫెసర్లు    503                    403            20         100
అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు       1825                  1383          57          442
సీఏఎస్‌లు/ట్యూటర్‌       1909                  1282         481        146
డెంటల్‌                       21                      16             02          03
నోట్‌: సీఏఎస్‌–సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లుAndhra Pradesh Govt Neglecting Fulfill

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement