బస్సు ‘బేరం’ కుదిరింది
‘అరుణాచల్’ బస్సులకు రైట్‌రైట్!
‘ముఖ్య’నేతతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల మంతనాలు
మంత్రి మధ్యవర్తిత్వం.. కుదిరిన బేరసారాలు
సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ‘ముఖ్య’నేత హామీ
ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరైన బస్సులకు మళ్లీ అనుమతులు?
త్రైమాసిక పన్ను కట్టించుకోవాలని రవాణా శాఖపై ఆపరేటర్ల ఒత్తిళ్లు
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న ప్రైవేట్ బస్సులను మళ్లీ రోడ్డెక్కించేందుకు ప్రయ త్నాలు ముమ్మరమయ్యాయి. కీలక మంత్రితో జరిపిన మంతనాలు సఫలం కావడం, బేరసారాలు కుదరడంతో త్వరలో తమ బస్సులు స్టేజీ క్యారి యర్లుగా తిరుగుతాయంటూ ప్రైవేట్ ఆపరేటర్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఉన్నతస్థాయిలో డీల్ కుదిరిందని, బస్సులకు త్రైమాసిక పన్ను(క్వార్టర్లీ ట్యాక్స్) కట్టించుకోవాలని రవాణా శాఖపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే, తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే పన్ను కట్టించుకుంటామని ఆయా జిల్లాల్లో రవాణాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
655 ప్రైవేట్ బస్సులు సీజ్
అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న ప్రైవేట్ బస్సులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల్లో తిప్పుతున్నారని అక్కడి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్లను ఈ ఏడాది జూన్ మొదటి వారంలో రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై ఏపీలో తిరుగుతున్న బస్సులను రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసింది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించిన 655 బస్సులను సీజ్ చేయడంతో ఆర్టీసీకి కొంత మేర ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో దాదాపు 2 నెలలుగా 655కు పైగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిలిచిపోయాయి.
మంత్రికి ముట్టిన తొలి విడత ముడుపులు
రాష్ట్రంలో సీజ్ చేసిన 655 ప్రైవేట్ బస్సులు అధికార పార్టీకి చెందిన వారివేనని, దీనివల్ల వారు నెలకు రూ.80 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతున్నారని కీలక మంత్రి ఒకరు ‘ముఖ్య’నేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. 655 బస్సులకు గాను ప్రతి మూడు నెలలకోసారి క్వార్టర్లీ ట్యాక్స్ కింద రూ.9.50 కోట్లు ప్రభుత్వానికి చెల్లించేవారని, ఆ బస్సులను సీజ్ చేయడంతో పన్నులు రాక ఖజానాకు నష్టం వాటిల్లుతోందని వివరించినట్లు తెలిసింది. సదరు కీలక మంత్రి ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా తరపున వకాల్తా పుచ్చుకుని వ్యవహారం చక్కబెట్టినట్లు సమాచారం.
ఆ మంత్రితో ముందుగానే బేరసారాలు కుదుర్చుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా తర్వాత నేరుగా ‘ముఖ్య’నేతను కలిసింది. ప్రభుత్వం సీజ్ చేసిన తమ బస్సులను రాష్ట్రంలో యథావిధిగా తిప్పుకునేందుకు అనుమతించాలని వేడుకోవడంతో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటానని ‘ముఖ్య’నేత అభయమిచ్చినట్లు సమాచారం. తొలి విడతగా మంత్రికి ట్రావెల్స్ మాఫియా భారీగా ముడుపులు చెల్లించినట్లు ప్రస్తుతం రవాణా శాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది.
రవాణా శాఖపై ఒత్తిడి
కీలక మంత్రి రాయబారం సఫలం కావడం, ప్రభుత్వాధినేత హామీ ఇవ్వడంతో ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా రవాణా శాఖపై ఒత్తిడి పెంచుతోంది. రాష్ట్రంలో తమ బస్సులను ఎప్పటిలాగే తిప్పుతామని తేల్చిచెబుతుండడం గమనార్హం. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల జోరు చూస్తుంటే ప్రభుత్వం నుంచి త్వరలోనే అన్ని అనుమతులు రానున్నాయని ప్రచారం జరుగుతోంది.