2 గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం
సీమాంధ్రలో సమైక్య సెగలు నిప్పులు కక్కుతున్నాయి. ఆ సెగలు పరంపర కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు వెంచేసియున్న తిరుమలను తాకాయి. దాంతో నిత్యం భక్త జన సంధ్రంతో కిటకిటలాడే తిరుమల మంగళవారం వెలవెలబోయింది. తిరుమలలోని తిరుమాడ వీధులు జనం లేక బోసిపోయాయి. కంపార్ట్మెంట్లు అన్ని దాదాపు నిర్మానుష్యంగా మారాయి. భక్తులు సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం 20 గంటలు పడుతుంది. అయితే సీమాంధ్ర ఉద్యమం పుణ్యమా అని భక్తులు 2 గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుంటున్నారు.
అలాగే తలనీలాలు సమర్పించే కళ్యాణకట్ట వద్ద భక్తులు బారులు తీరుతుంటారు. అక్కడ కూడా భక్తుల రద్దీ చాలా తక్కవగా ఉంటుంది. దీంతో తిరుపతి నుంచి కాలినడక కొండపైకి వచ్చే భక్తులు మొక్కులు, దేవుని దర్శనం చేసుకుని సాయంత్రానికి కాలినడకన తిరుపతికి బయలుదేరుతున్నారు. గతంలో విఐపీ సిపార్సు లేఖతో వెళ్లిన శ్రీవారి దర్శనం ఐదారుగంటలు సమయం పట్టేది. సమైక్యాంధ్ర సెగతో నేడు వెంకన్న దర్శనం రెండుగంటల్లో పూర్తి కావడంతో భక్తులు ఆనంద పరవశులవుతున్నారు.
అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులకు కలగకుండా ఉండేందుకు సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో టీటీడీ ఈఓ ఎం.జీ.గోపాల్, చిత్తూరు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే సమ్మెను విరమించుకుని ఆర్టీస్ బస్సులను తిరుమల కొండపైకి నడపాలని అర్టీసీ ఎండీ ఏ.కే.ఖాన్ మంగళవారం అర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఆ విషయంపై కార్మికులతో చర్చలు జరపాలని అర్టీసీ ఎండీ తిరుపతి డిఎంను ఆదేశించారు. ఈ రోజు సాయంత్రం కార్మికులు, డిఎం మధ్య చర్చలు జరగనున్నాయి. 38 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత కొండ పైకి ఆర్టీసీ బస్సులు వెళ్లడం ఆగిపోయింది.