గజలక్ష్మికి కోపమొచ్చింది!
* ఉదయ వ్యాహ్యాళిలో హడావుడి చేసిన శ్రీవారి ఏనుగు
ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయూనికి చెందిన ఏనుగు(గజలక్ష్మి) శుక్రవారం హడావుడి చేసింది. మావటులు దానిని ఉదయ వ్యాహ్యాళికి తీసుకెళ్లిన సమయంలో కోపంతో చిందులేసింది. సమీపంలోని జీడిమామిడి తోటల్లోకి పరుగులు తీసి చెట్లను ధ్వంసం చేసింది. రోడ్డుపై పరుగులు తీస్తూ వాహన చోదకులను, ప్రయూణికులను హడలెత్తించింది. మావటులు సుమారు రెండు గంటలపాటు శ్రమించి ఏనుగును అదుపులోకి తెచ్చారు.
శ్రీవారి గజశాలలో ఉన్న ఏనుగును రోజూ ఉదయం, సాయంత్రం సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర నడిపిస్తారు. దీని వెనుక ఇద్దరు మావటులు ఉంటారు. శుక్రవారం ఉదయం ఘాట్‌రోడ్డులో రాళ్లకుంటవైపు వెళుతున్న గజలక్ష్మి ప్రవర్తనలో తీవ్ర మార్పు కనిపించింది. మావటి సూచనలను పట్టించుకోకుండా ఘీంకరిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించింది. దేవస్థానం వైద్య నిపుణుల సలహా మేరకు రెండు రోజులపాటు వ్యాహ్యాళిని నిలుపుదల చేసి గజలక్ష్మికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు.