
ఒంగోలు సబర్బన్: జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించి వారిలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే బెస్ట్ పోలీస్ ఆఫ్ ద వీక్ అవార్డు కానిస్టేబుల్ డి.అనీల్ కుమార్‌కు దక్కింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు తన చాంబర్‌లో సోమవారం కానిస్టేబుల్ అనిల్ కుమార్‌కు అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందించారు. చీమకుర్తి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ డి.అనిల్ కుమార్ 2013 బ్యాచ్‌కు చెందిన వ్యక్తి. ఇతను సంఘ వ్యతిరేక శక్తులపై దృష్టి సారించి వారి గురించి ముందస్తు సమాచార సేకరణలో నిమగ్నమయ్యాడు.
ఆ సమాచారాన్ని పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావటంలో సఫలమయ్యాడు. నిందితులను పట్టుకోవటంలో పూర్తి స్థాయిలో పోలీస్ విభాగానికి సహకరించి, ప్రధాన పాత్ర పోషించాడు. దీంతో ఇతనికి నగదు బహుమతిని కూడా అందించారు. అనిల్ కుమార్‌ను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణతో పనిచేసి బెస్ట్ పోలీసులుగా పేరుతెచ్చుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.