సాక్షి, విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్ పనులను నిలిపివేశామని టీడీపీ అసత్య ప్రచారాన్ని నీటి పారుదల శాఖమంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఖండించారు. శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పోలవరంపై పూర్తి స్పష్టత ఇచ్చారని ఆయన తెలిపారు. పోలవరం ఒక్కటే కాదని, నిబంధనలకు విరుద్దంగా అంచనాలు పెంచి ఖరారు చేసిన ప్రతి ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు అసలు పోలవరం ఊసే ఎత్తలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహోన్నత ఉద్దేశంతో పోలవరానికి శ్రీకారం చుట్టారు. గడిచిన అయిదేళ్లలో కూడా చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయి. మూడేళ్ల పాటు పనులు చేయకుండా ఎన్నికల ముందు పోలవరం వద్ద హడావిడి చేసి షో చేశారు. పనుల కంటే ప్రచారంపైనే చంద్రబాబు ఎక్కువ శ్రద్ధ పెట్టారు. పబ్లిసిటీ పిచ్చితో రూ.200 కోట్లు వృధా చేశారు. చంద్రబాబు పోలవరం నిర్వాసితుల పునరావాసం గురించి ఏమైనా పట్టించుకున్నారా?. పునరావాసానికి ఇంకా సుమారు రూ.30వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పునరావాస విషయంలో మేం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.
చదవండి: పారదర్శకం.. శరవేగం..
వరద కారణంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పనులు ప్రారంభించే అవకాశం లేదు. టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. రీ టెండరింగ్ నిర్వహించిన పనులను నవంబర్ నుంచి పారదర్శకంగా జరిగేలా చేస్తాం. వైఎస్సార్ పునాది వేసిన పోలవరాన్ని ఆయన తనయుడు వైఎస్ జగన్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారు. దైవ నిర్ణయం కాబట్టే టీడీపీ హయాంలో పనులు ముందుకు సాగలేదు. ఎంపీ సుజనా చౌదరి వ్యవహారం చూస్తే విస్మయం కలుగుతోంది. ఆయన ఇంకా టీడీపీ నేతగానే కొనసాగుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ ఆపేయాలని సుజనా చౌదరి చెప్పడం విడ్డూరంగా ఉంది.
చంద్రబాబు తన అయిదేళ్ల పాలనలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. అవినీతి సొమ్ము మూటగట్టుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. చంద్రబాబు సర్కార్ చేసిన తప్పులను సరిదిద్ది పాలనను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి భేటీ అవుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కావల్సిన నిధులు అడుగుతారు. ఈ విషయంలో చంద్రబాబుకు చింత అనవసరం. రివర్స్ టెండరింగుకు వెళ్తే తమ దోపిడీ బయటపడుతుందని టీడీపీకి భయమా?.
సెప్టెంబర్ నాటికి కొత్త ఏజెన్సీలకు పనులు అప్పగిస్తాం. ప్రీ-క్లోజర్ విషయాన్ని పీపీఏకు, కేంద్రానికి నోట్ పంపాం. ఇక ఓ విధంగా లేబర్ కాంట్రాక్ట్ పనులు చేసిందని చెప్పాలని, నిబంధనల ప్రకారమే నోటీసులు ఇచ్చాం. కాఫర్ డ్యామ్ మునిగే పరిస్థితికి వచ్చింది. స్పిల్ వే మునిగిపోయింది. నవయుగకు ఇంకా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏముంది?. ఆ కంపెనీకి నష్ట పరిహారం చెల్లించడం దేనికి?. డీజిల్, సిమెంట్, స్టీల్ ఖర్చులు ప్రభుత్వమే పెట్టింది. నవయుగ కేవలం లేబర్ కాంట్రాక్ట్ మాత్రమే చేసింది. బిల్లులన్నీ వెరిఫై చేస్తున్నాం. 60 సీ కింద కాంట్రాక్ట్ మార్పిడి జరిగిన సందర్భంలో ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇచ్చిన డబ్బులను కూడా రికవరీ చేస్తాం. ఏదీ వదిలిపెట్టం’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment