జంగారెడ్డిగూడెంలో అన్నక్యాంటిన్ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన శిలాఫలకం, టీడీపీ కౌన్సిలర్లు తొలగించిన తర్వాత ఇలా..
పశ్చిమగోదావరి , జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో అన్న క్యాంటిన్ ప్రారంభోత్సవం కార్యక్రమం బుధవారం రసాభాసగా మారింది. స్థానిక వారపుసంత సమీపంలో నగర పంచాయతీ కార్యాలయ నూతన భవన సమీపంలో అన్నక్యాంటిన్ భవన నిర్మాణం చేపట్టినా ఇంకా పూర్తికాలేదు. అయితే ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల షెడ్యూల్ గురువారం వస్తుందని భావించిన టీడీపీ నేతలు హడావుడిగా అన్నక్యాంటిన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల షెడ్యూల్, వెనువెంటనే సాధారణ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావించిన నేతలు ఇక అన్న క్యాంటిన్ తమ హయాంలో ప్రారంభించే అవకాశం లేదని భవన నిర్మాణం పూర్తికాకపోయినా హడావుడిగా శిలాఫలకాన్ని ఏర్పాటుచేశారు. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే పీతల సుజాత హాజరయ్యారు.
అయితే శిలాఫలకంపై ఒక్క కౌన్సిలర్ పేరు మాత్రమే ఉండటంతో మిగిలిన టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహించి ప్రారంభోత్సవానికి ముందే శిలాఫలకాన్ని తొలగించారు. తమ పేర్లు లేకుండా అన్న క్యాంటిన్ ప్రారంభించేది లేదని భీష్మించారు. దీంతో ఎమ్మెల్యే సుజాత స్వపక్ష కౌన్సిలర్లను శాంతింపచేసే ప్రయత్నాలు చేశారు. చివరకు కౌన్సిలర్లు పెకిలించిన శిలాఫలకాన్ని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరింపచేసి రాత్రి సమయంలో హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు.
Comments
Please login to add a commentAdd a comment