రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజైన బుధవారం కూడా కొనసాగాయి. పార్టీకి చెందిన నియోజకవర్గ సమన్వయకర్తలు రాజధానిలో జరిగే పార్టీ సమావేశానికి బయల్దేరడంతో అనుబంధ సంఘాల కన్వీనర్లు, ద్వితీయ శ్రేణి నేతలు బుధవారం రిలే నిరాహార దీక్షల్ని కొనసాగించారు.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ దీక్షలు జరిగాయి. కొన్ని నియోజకవర్గాల్లో రెండు మూడు ప్రాంతాల్లో స్థానిక నాయకులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, దీక్షలకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. జై సమైక్యాంధ్ర, జైజై జగన్ నినాదాలతో హోరెత్తించారు. సమైక్యాంధ్ర సాధన వై.ఎస్.జగన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు.