యాంటీ ఫైర్ పరికరాలు పనిచేయకపోవడం వల్లే తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్ పగిలి, భారీ అగ్నిప్రమాదం సంభవించిందంటున్నారు.
యాంటీ ఫైర్ పరికరాలు పనిచేయకపోవడం వల్లే తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్ పగిలి, భారీ అగ్నిప్రమాదం సంభవించిందంటున్నారు. దాదాపు వంద మీటర్ల ఎత్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. మృతుల సంఖ్యను ప్రాథమికంగా 13 అని నిర్ధారించినా, అది కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. చుట్టుపక్కల ఉన్న కొబ్బరి తోటలకు కూడా మంటలు వ్యాపించాయి. పొగలు దట్టంగా అలముకోవడంతో సహాయ చర్యలు చేపట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిపుణులు చేరుకున్నారు. గెయిల్ గ్యాస్ పైపులైన్లు తరచు లీకవుతున్నా, పాతబడిపోయిన పైపులైన్లను మార్చేందుకు చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు.
ప్రస్తుతం రిఫైనరీకి కాకుండా, గ్రీన్బెల్ట్ వద్ద ప్రమాదం సంభవించడంతో తీవ్రత కొంతవరకు తగ్గినట్లేనని చెబుతున్నారు. ఇప్పటివరకు 13 మృతదేహాలను బయటకు తీశారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సాంకేతిక పరమైన చర్యలు చేపట్టడానికి అవకాశం లేకపోతోంది. పైప్లైను పగుళ్లను నివారించడానికి, మంటలను అదుపుచేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. నివాసప్రాంతాలకు సమీపంలోనే ఈ ప్రమాదం సంభవించడంతో తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా సంఘటన స్థలానికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.