సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండో రోజు సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పల నాయుడు... గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా తన తల్లి మరణం కారణంగా తొలి రోజు శాసనసభలో ఆయన ప్రమాణం చెయ్యలేదు. దీంతో మొత్తం సభ్యుల ప్రమాణ స్వీకార ఘట్టం పూర్తయ్యింది. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. కాగా ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభలో 173 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం నిరాడంబరంగా, సంప్రదాయబద్ధంగా పూర్తయిన విషయం తెలిసిందే.
చదవండి...(కొలువుదీరిన కొత్త సభ)
ఇక నిన్న అసెంబ్లీకి ఎన్నికైన 175 మంది శాసనసభ్యుల్లో ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పల నాయుడుతో కలిపి 174 మంది హాజరయ్యారు. ఈ నేపథ్యంలో 149 మంది వైఎస్సార్ సీపీ సభ్యులతోపాటు 23 మంది టీడీపీ సభ్యులు, జనసేన నుంచి ఒక్క సభ్యుడు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన మాతృమూర్తి పెద్ద కర్మ ఉన్నందున నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన వెంటనే శాసనసభ గురువారానికి వాయిదా పడింది.
కాగా, ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. స్పీకర్ పదవికి బుధవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో గురువారం ఆయన ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు. 15వ శాసనసభ తొలిరోజు ఎమ్మెల్యేల పదవీ ప్రమాణస్వీకారం జరిగింది. ఇదే రోజున స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. సాయంత్రం ఐదు గంటలలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా తమ్మినేని నామినేషన్ ఒక్కటే దాఖలైంది. తమ్మినేని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులతో సహా 30 మంది ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌గా తమ్మినేని ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment